సంగారెడ్డి, మే 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైంది. సంగారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రైతులు వరి కోతలు పూర్తిచేసి నెలరోజులు కావస్తున్నా, తగినంత మాయిశ్చర్ వచ్చినా.. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కొద్దిరోజులుగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించినా ఫలితం కానరావడం లేదు.
చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లో కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం కలెక్టర్ ప్రతీక్ జైన్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ చెప్పినా కొనుగోళ్లు సాగకపోవడంతో రైతులు బుధవారం ఇస్నాపూర్ వద్ద 161 జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. అదనపు కలెక్టర్ పాండు రైతుల వద్దకు వచ్చి వెంటనే ధాన్యం కొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు.

సేకరించింది 9.02 శాతం మాత్రమే..
సంగారెడ్డి జిల్లాలో 2.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9.02 శాతం ధాన్యం మాత్రమే సేకరించారు. యాసంగి సీజన్లో 1.02 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతుల అవసరాలు పోగా, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ ఆధ్వర్యంలో 101, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 130, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో 2, మొత్తం 233 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 135 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు ప్రారం భం అయ్యాయి.
మొత్తం 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు అధికారులు 19,834 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. రైతుల నుంచి 18,732 టన్నుల దొడ్డురకం, 1102 టన్నుల సన్నరకం ధాన్యం సేకరించారు. జిల్లాలో అందోల్, పుల్కల్, చౌటకూర్, హత్నూర, సంగారెడ్డి, సదాశివపేట, కల్హేర్, నారాయణఖేడ్, సిర్గాపూర్ మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ కొనుగోల్లు మందకొడిగా సాగుతుండడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గన్నీ బ్యాగులు, లేబర్, లారీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సరిపడా గన్నీబ్యాగుల సరఫరాలో అధికారులు విఫలం అవుతున్నారు. లారీల కొరత తీవ్రంగా ఉంది.

లారీల కేటాయింపులో జాప్యం
లారీల కేటాయింపులో జాప్యంతో వందలాది ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్నాయి. చాలామంది రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోసుకుని ఉంటున్నారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోతున్నది. లేబర్ కొరత కారణంగా ధాన్యం బస్తాల లోడింగ్, అన్లోడింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైస్ మిల్లుల కేటాయింపు సజావుగా లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాలుగు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ఒక రైస్‌మిల్లు కేటాయించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 కొనుగోలు కేంద్రాలకు ఒక్క రైస్‌మిల్లు కేటాయిస్తున్నారు. హత్నూర మండలంలో 19 కొనుగోలు కేంద్రాలకు కొన్యాలలోని ఒక్క రైస్‌మిల్లును కేటాయించారు. 19 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఒకే రైస్‌మిల్లుకు కేటాయించడంతో ఆన్లోడింగ్ జాప్యం జరుగుతున్నది. తరుగు పేరిట రైతుల నుంచి 5 నుంచి 7 కిలోల ధాన్యం అదనంగా దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని రైతులు మండిపడుతున్నారు.