హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 29: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూ చించారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని ఆర్కే జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయ న మా ట్లాడుతూ.. రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 322 కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని కోరారు.
పత్తిలో తేమ శాతం 8లోపు ఉంటే మద్దతు ధర రూ.7500 లభిస్తుందని, రైతులు తొందరపడి తక్కువ ధరకు పత్తిని విక్రయించి నష్టపోవద్దని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా చూసుకోవాలని సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నాయకులు మద్దతుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్ల కేటాయింపులు జరుగలేదన్నారు.
జీరో డ్యూటీ ఉండి ప్రభుత్వానికి మంచిగా చెల్లించిన వారికే కేటాయింపు చేస్తామని తెలిపారు. మిల్లర్ల కేటాయింపుతో పాటు 60-70శాతం మంచిగా చెల్లించిన వారికి 10శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అవకాశం కల్పిస్తున్నామన్నారు. డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కేటాయించడం లేదని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితవెంకట్, సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, వైస్‌చైర్మన్ అయిలేని అనిత, సీసీఐ అధికారులు ఉన్నారు.