సిర్గాపూర్, అక్టోబర్ 04 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. శనివారం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామపంచాయతీకి వచ్చారు. నీటి సమస్యపై పట్టించుకోని సెక్రెటరీ పనితీరు వ్యవహారంపై గ్రామస్తులు మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించి, పరిష్కారానికి నిర్లక్ష్యం చేసిన సెక్రెటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. కోపోద్రిక్తులైన స్థానికులు అధికారులను చుట్టుముట్టడంతో, సిర్గాపూర్ ఎస్సై మహేష్ జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చ చెప్పారు.
అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు ఖాళీ బిందెలు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని గ్రామ నీటి పథకం బోర్లు ఏ ఒక్కటి పనిచేయడం లేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా అసలే లేదని మహిళలు ఆ విధంగా తెలిపారు. వెంటనే నీటి సరఫరాకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని కార్యదర్శి వెంకటేష్ తెలపడంతో ప్రజలు శాంతించారు. అప్పుడే గ్రామంలో కొత్త సింగిల్ ఫేజ్ మోటార్‌ను తెచ్చి ఫిట్టింగ్ చేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.