సిద్దిపేట, మే 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలతో పాటు, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జీలను గురువారం నియమించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కోసం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఇన్చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లును పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నియమించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్‌ల సంఖ్యను బట్టి బూత్‌కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీనుంచి వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు.
శిక్షణకు హాజరైన వారికి భోజన వసతి కల్పిస్తారు. రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జ్జీల ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారాలను ఆయా జిల్లాల వారీగా నిర్వహిస్తారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు. ప్రకటించిన తేదీ రోజు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్ధరణలో పాల్గొంటారు. పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ సభ్యత్వ పునరుద్ధరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.ప్రకటించబడిన నిర్ణీత తేదీల్లో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గ ఇన్చార్జ్జీలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్‌కు వేలేటి రాధాకృష్టశర్మ, దుబ్బాకకు కాసాల బుచ్చిరెడ్డి, హుస్నాబాద్‌కు జీవీ రామకృష్ణారావు, జనగామకు బండ శ్రీనివాస్, మెదక్ జిల్లాలో మెదక్‌కు మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, నర్సాపూర్‌కు నరహరిరెడ్డి, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డికి చంద్రాగౌడ్, పటాన్‌చెరుకు ఎర్రోళ్ల శ్రీనివాస్, జహీరాబాద్‌కు దేవీప్రసాద్, నారాయణఖేడ్‌కు జయపాల్‌రెడ్డి, అందోల్‌కు పట్నం మాణిక్యాన్ని పార్టీ సభ్య త్వ నమోదు కోసం ఇన్‌చార్జీలుగా నియమించారు. త్వరలోనే తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం వీరు ఆయా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ప్రజలను ఎక్కడికక్కడ సంఘటితం చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ ఎండగడుతున్నది. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ప్రభుత్వ వైఖరిపై అన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని పటిష్టం చేయనున్నారు.
వచ్చే రెండేండ్లలో జరిగే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయనున్నారు. చురుగ్గా పాల్గొనే వారికి భవిష్యత్‌లో పార్టీలో గుర్తింపు ఉండనున్నదని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. పార్టీ కోసం పనిచేయకుండా పైపైన తిరిగే వారికి ఎలాంటి పదవులు ఇవ్వడం జరగదని పార్టీ అధినేత చెప్పిన విషయాన్ని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ ప్రజల్లో కలిసి ఉండే నాయకులకు భవిష్యత్ ఉండనున్నది. పార్టీ సభ్యత్వంలో క్రియాశీలకంగా పని చేసే వారికి క్రియాశీల సభ్యతం ఇవ్వనున్నారు. పార్టీ సభ్యత్వంతోపాటు పార్టీ పదవులు త్వరలో భర్తీ కానుండటంతో నూతన ఉత్తేజం రానున్నది. రాబోయే రెండేండ్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకువచ్చి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాలనే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగనున్నారు.