జహీరాబాద్, జూలై 17: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం రాత్రి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయి ఉన్నట్టుండి తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని ఉపాధ్యాయలు, సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారులు విద్యార్థినులకు పరీక్షలు చేశారు.
వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే 108 వాహనంలో జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యాధికారులు విద్యార్థినులకు వైద్యపరీక్షలు చేసి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులు కోలుకుంటున్నారని కస్తూర్బా విద్యాలయం ఇన్చార్జి ప్రత్యేకాధికారి సంగీత తెలిపారు. డీఈవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రభు, డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, ఎంఈవో మారుతీరాథోడ్ గురువారం గురుకుల పాఠశాలను సందర్శించారు.
ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఘటనపై వివరాలు ఆరా తీశారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యాలయం పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో సూచించారు. ప్రత్యేక దృష్టిసారించి విద్యార్థినులు జబ్బుల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.