ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు… నీటి కోసం వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క రాకపోయేది . సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా కనీసం తట్టెడు మట్టి ఎత్తినపాపాన పోలేదు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో రైతులు పడ్డకష్టాలు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ నేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కావడంతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. నీటి పారుదల రంగానికి భారీగా నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో వందలాది చెరువులు, చెక్‌డ్యామ్‌లను మండుటెండల్లోనూ నింపారు. ఎక్కడో పుట్టిన గంగమ్మను తీసుకువచ్చి రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు నింపుకుంటూ 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి మళ్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు పారి పచ్చని పంటలతో మెతకుసీమకు పూర్వవైభవం వచ్చింది. ఇవ్వా ళ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తుంది. ప్రాజెక్టును నిర్వీర్యం చేసే పన్నాగం పన్నుతుంది.
సిద్దిపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ భగీరథ ప్రయత్నం..మాజీ మంత్రి హరీశ్‌రావు నిరంతర శ్రమ ఫలితంగా గోదావరి జలాలతో బీడుభూములు పచ్చని పంటపొలాలుగా మారాయి. సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు మిడ్‌మానేరు నుంచి వస్తున్నాయి. మేడిగడ్డ నుంచి తరలించిన కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టుకు చేరుతున్నాయి. తెలంగాణ వచ్చిన (2014 ) తర్వాత సిద్దిపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక శాతం నిధులు ఖర్చుచేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర ఏండ్లలో పూర్తి చేయించారు. మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరించడం, పూడికతీత పనులు చేపట్టారు. అత్యధిక సంఖ్య లో చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరిగాయి.
బహుళార్థసాధక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు, 18.83 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఏడు లింకులు, మూడు బ్యారేజ్‌లు, 15 రిజర్వాయర్లు, 22 పంప్‌హౌస్‌లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్లు, 1,531 కిలో మీటర్ల ప్రధాన కాల్వ, 203 కిలో మీటర్ల పొడవుగల సొరంగం నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల నిలువ సామర్థ్యం మొత్తం 141.00 టీఎంసీ గోదావరి నీరు మెడిగడ్డ బ్యారేజీ లెవెల్ +88 మీ. నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లెవెల్ +618 మీ. ఎత్తుకు బహుళదశల్లో లిఫ్ట్ చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 10లో భాగంగా మిడ్‌మానేరు నుంచి గోదావరి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. దీని కెపాసిటీ 3.50 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్యన ఈరిజర్వాయర్ నిర్మించారు. ఈ రిజర్వాయర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30వేల ఎకరాల ఆయకట్టు, సిద్దిపేట జిల్లాలో 15,200 ఎకరాలు సాగులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -11లో అన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని కెపాసిటీ 3 టీఎంసీల సామర్థ్యం.
ఇది చంద్లాపూర్, పెద్దకోడూరు గ్రామాల మధ్య ఒక ద్వీపకల్పంలా ఉంటుంది. రిజర్వాయర్ మధ్యలో ఉన్న గుట్టపై ఎస్ఈ కార్యాలయంతోపాటు ఫోర్‌సూట్ గెస్ట్‌హౌజ్ నిర్మించారు. ఈ రిజర్వాయర్ బండ్ నిర్మాణం 8.6 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. 2020 ఏప్రిల్ 23న అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పంపులను ఆన్‌చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. దీనికి కుడి ,ఎడమ కాల్వలు నిర్మించారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 23 ఫిబ్రవరి-2022, కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 29 మే-2020లో మాజీ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ఉంది.
కొమురవెల్లి మండలం ఐనాపూర్ – తపాస్‌పల్లి గ్రామాల శివారు మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను 0.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ ద్వారా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులను ప్రతిసంవత్సరం నింపుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీని సామర్థ్యం 8.23 టీఎంసీలు.ఇటీవలనే పంపులను ఆన్‌చేసి ట్రయల్ రన్ సైతం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్య అన్నపూర్ణ (అనంతగిరి 3.50 టీఎంసీల సామర్థ్యం) రిజర్వాయర్ నిర్మించారు. దీనిని సుమారు రూ. 2,700 కోట్లతో చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 10లో భాగంగా రాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. అప్రోచ్ చానల్, గ్రావిట్ కెనాల్ 2.380, మెయిన్ కెనాల్ 7.65 కిలో మీటర్లు ఉంది. తిప్పారం వద్ద 400/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండలం తిప్పారం వద్ద ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ సర్జిపుల్ పంపు నిర్మించారు. ఈ రిజర్వాయర్‌తో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ – పెద్దకోడూరు గ్రామాల శివారులో రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ 8.65 కి.మీ పొడవు ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ (బండ్ ) 1.746 కి.మీ వద్ద స్లూయిస్(తూం) ఏర్పాటు చేసి నాలుగు గేట్లు బిగించారు. హెడ్‌రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ కెనాల్, సొరంగం ద్వారా గోదావరి జలాలు రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు.ఈ రిజర్వాయర్‌ను 24 ఏప్రిల్-2020లో అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50టీఎంసీలసామర్థ్యంతో నిర్మించారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు వ్యవసాయానికి, తాగు నీటికి, పరిశ్రమలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా తొగుట మండలం దగ్గర ఈ భారీ రిజర్వాయర్ నిర్మించారు.ఈ రిజర్వాయర్ నిర్మించడం కోసం తొగుట, కొండపాక మండలాల్లో భూమి సేకరించగా ఎర్రవల్లి, సింగారం, పల్లెపహాడ్, వేములఘాట్,ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మిపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి ముంపునకు గురికాగా తొగుట, తుకాపూర్,తిప్పారం, మంగోల్ గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి.
ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు గజ్వేల్ మండలంలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల్లో 600 ఎకరాల్లో ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను 23 ఫిబ్రవరి-2022లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రిజర్వాయర్ మొత్తం పొడవు 22. 600 కి.మీటర్లు కాగా ఐదు ప్రధాన తూములు నిర్మించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 16,43,665 ఎకరాలకు నీటి సరఫరా కోసం ప్రతిపాదించారు. 4,25,585 ఎకరాల ఆయకట్టును సింగూర్ ప్రాజెక్టు, వనదుర్గ (ఘనపూర్ అనికట్ట), నిజాంసాగర్,తపాసుపల్లి రిజర్వాయర్ల ద్వారా స్థిరీకరించారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ వరకు నీటిని అందించి రికార్డు సృష్టించారు.కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు, మంజీరాగుండా 90 కి.మీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గొల్లిలింగాల వద్ద నిజాంసాగర్‌లో గోదావరి జలాలు కలిశాయి. ఇది ఒక రికార్డు అని చెప్పాలి. వర్గల్ మండలం( సంగారెడ్డి కెనాల్ నుంచి)లో వరుసగా నాలుగు పెద్ద చెరువులు నింపుకొని హల్దీవాగుపైన 32 చెక్‌డ్యామ్‌లు నింపారు. సిద్దిపేట జిల్లాలో 9 చెక్‌డ్యామ్‌లు, మెదక్ జిల్లాలో 23 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి.
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలంలో చేబర్తి పెద్దచెరువు వద్ద కుడ్లేరువాగు ప్రారంభమవుతుంది.ఇదే వాగును కూడవెల్లివాగుగా పిలుస్తారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లివాగుకు,దాని పై నిర్మించిన 33 చెక్‌డ్యామ్‌లకు 2020-21 నుంచి 6,308 ఎకరాల ఆయకట్టు ఉంది.
గజ్వేల్ నియోజకవర్గంలో తొమ్మిది చెక్‌డ్యామ్‌ల ద్వారా 2,380 ఎకరాల ఆయకట్టు పారుతుంది. ఈ క్రమంలో కూడవెల్లివాగు జీవనదిగా మారి ఎగువ మానేరు డ్యామ్ వరకు నీరుఅందించడంతో పాటు దాని కింద. 16,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కూడవెల్లివాగుతో గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్‌పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి ,దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీర్రావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు నీరు ప్రవహిస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ 15టీఎంసీల సామర్థ్యంతో (ఆయకట్టు సాగు, తాగునీరు, పరిశ్రమల కోసం) మరుక్ మండలంలోని పాములపర్తి వద్ద నిర్మించారు. ఈ రిజర్వాయర్ వల్ల ములుగు మండలం మామిడియాల, బైలాన్పూర్,తానేదార్పల్లి గ్రామాల్లో భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మూడు గ్రామాలు ముంపునకు గురయ్యా యి. ప్రాజెక్టు నిర్వాసితులకు ములుగు మండలం తునికి బొల్లారంలో ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ నిర్మించారు. ఈరిజర్వాయర్ను 29 మే-2020లో అప్పటి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ద్వా రా మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మలాజ్‌గిరి జిల్లాలు లబ్ధిపొందుతున్నాయి.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా లబ్ధిపొందే జిల్లాలు మొత్తం 10 ఉండగా వాటిలో రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ,కామారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్-మలాజ్‌గిరి,జనగామ జిల్లాలు ఉన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా 24నియోజకవర్గాలు లబ్ధిపొందుతున్నాయి. వాటిలో సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక,గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, పటాన్చెరు, ఆలేరు, భువనగిరి ,మునుగోడు, నకిరేకల్, కామారెడ్డి, బాన్సువాడ, జుకల్, యల్లారెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, బోధన్, నిజామాబాద్, జనగామ ఉన్నాయి.
కాల్వల ద్వారా మా గ్రామానికి గోదావరి నీళ్లు వస్తున్నాయంటే కేసీఆర్ సారు దయవల్లనే. ఆయన మా రైతుల పాలిట దేవుడు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాల్వల ద్వారా గోదావరి నీళ్లు రావడం నిజంగా మా అదృష్టం. మాజీ సీఎం కేసీఆర్ వల్ల సాగునీటి గోస తీరింది. వానకాలం, యాసంగి పంటలకు నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. నాలుగేండ్ల నుంచి సాగునీటికి ఇబ్బంది లేదు. ఐదు ఎకరాల్లో వరి పంట పండిస్తున్నా. మల్లన్నసాగర్ నిర్మించకముందు కేవలం ఎకరంలో పంట సాగు చేసేది.
అదికూడా వర్షాలు పడితేనే పంట సాగుచేసేది లేకపోతే బీడుగా ఉండేది. మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నీరు రావడం వల్ల గ్రామంలో బీడుభూములు కనిపించడం లేదు. మా పొలం పక్క నుంచి కాల్వ ద్వారా నీళ్లను చూస్తే..కడుపు నిండినట్లు ఉంది. కాళేశ్వరం నీటితో పుష్కలంగా రెండు పంటలు పండించుకుంటున్నాం. ఇందుకు గులాబీ అధినేత కేసీఆర్ సారుకు రైతులంతా రుణపడి ఉంటారు.నిజమైన రైతు బాంధవుడు కేసీఆర్ సారు.
-చిర్ర రవి, రైతు, అప్పనపల్లి, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా