సిద్దిపేట, మే 31: కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ లో గంగమ్మ దేవాలయం వార్షికోత్సవంలో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారులకు లూనాలు, ఆటోలు, ఐస్ బాక్సులు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. కాలమైనా కాకపోయినా చెరువులను కాళేశ్వరం నీటితో చెరువులు నింపామని, యాసంగి పంటలు అయిపోయినా రాఘవాపూర్ చెరువు నీటితో నిండుగా ఉందని, ఇది కేసీఆర్ కృషి ఫలితం అన్నారు.
కొంతమంది హైదరాబాదులో కూర్చుని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞానం ఉందో లేదో తెలియదని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరం పారలేదని ఆయన అనడం విచిత్రంగా ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ నుంచి ఇకడి పొలాలకు నీళ్లు వచ్చింది వాస్తవమా కాదా మంత్రి చెప్పాలన్నారు. కాళేశ్వరం లేకుంటే రాఘవపూర్ చెరువులో నీళ్లు ఎకడి నుంచి వచ్చాయని మంత్రి ఉత్తమ్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యతమిస్తూ బతుకుదెరువు చూపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలను ఆగంజేస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు, చెరువుల్లో సకాలంలో చేప పిల్లలు పోసేటోళ్లమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేప పిల్లల పంపిణీ ఊసేలేదన్నారు. నేడు గ్రామాల్లో ప్రజల చేతిలో పైసలు లేని పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఏటా రెండు పంటలకు సకాలంలో రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేశామని, రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా ఎగ్గొట్టిందని విమర్శించారు. రుణమాఫీ సగం మంది రైతులకు కాలేదని, దవాఖానలో కేసీఆర్ కిట్టు బంద్ ఆయిందని, ఆసరా పింఛన్లు రెండు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు.
కేసీఆర్ లేని లోటును ప్రజలు గమనిస్తున్నారని, రేవంత్ పాలనలో భూముల రేట్లు చాలా తగ్గిపోయాయని, రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు చనిపోతే బీమా ఇవ్వడం లేదన్నారు. రైతుబీమా బీమా ప్రీమియం నాలుగు నెలల నుంచి పెండింగ్‌లో ఉందన్నారు. బూతులు తిట్టడం తప్ప ఈ సీఎం ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక పని చేశాడని ఎద్దేవా చేశారు. రాఘవాపూర్ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని హరీశ్‌రావు హామీ ఆచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్ రావు, మాజీ సర్పంచ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.