సిద్దిపేట, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో జోష్‌ను నింపాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు చేద్దామని కేసీఆర్ ఇచ్చిన పిలుపు క్యాడర్లో సమరోత్సాహాన్ని నింపింది. కేసీఆర్ మాట్లాడిన వీడియోలను వాట్సాప్ స్ట్టేటస్, ఇన్స్టాగాం, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టుకొని హల్చల్ చేశారు. ఇక మా బాస్ కేసీఆర్ బయలు దేరుతుండు..ఇక కాసుకోండి అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టనున్నారు. కొట్లాడితే కాని రాదని, కొట్లాట తప్పదన్న కేసీఆర్ వ్యాఖ్యల స్ఫూర్తితో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు కదలనున్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర పటేల్ ఆధ్వర్యంలో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రగా వచ్చి కలిశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ మాటలు అధికార కాంగ్రెస్ పార్టీలో గుబులు రేకెత్తించాయి. మొదటి నుండి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. ఈ ప్రాంత రైతులను సమీకరించి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రత్యక్ష పోరాటాల ద్వారా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను సాధిద్దామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల సాధనలకు హరీశ్‌రావు నేతృత్వంలో పోరుకు బీఆర్ఎస్ సిద్ధ్దమవుతోంది.
సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ఆపి రైతులను ఇబ్బంది పెడుతున్నది. దీనిపై బీఆర్ఎస్ రణం చేయనున్నది. అలాగే రైతులకు పంట రుణమాఫీ కాలేదు, రైతుభరోసా పత్తా లేదు. కేసీఆర్ కిట్టు లేదు. ఆసరా పింఛన్ల పెంపు లేదు. ఇలా పలు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీఆర్ఎస్ క్యాడర్ సమాయత్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కోనేలా బీఆర్ఎస్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.
యాసంగి సాగులో రైతులకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నది. విద్యుత్ సమస్య అప్పుడే మొదలైంది. తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. సాగునీరు ఇవ్వడం లేదు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలను సిద్ధ్దం చేస్తున్నది. ఇప్పటికే రైతు సమస్యలపై ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల రైతు సభలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ క్యాడర్ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నది.