Judge Hemalatha | నర్సాపూర్, అక్టోబర్ 25 : విద్యార్థులకు ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత ఉపాధ్యాయులకు సూచించారు. నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో గల ప్రభుత్వ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరిచి ఇబ్బందులు పడుతున్నారని పలు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా న్యాయమూర్తి హేమలత స్పందించి పాఠశాలను శనివారం సందర్శించారు.
ఎలుకలు కరిచిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం గురుకులంలో విద్యార్థుల కోసం వండిన భోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించి, విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు చట్టపరమైనటువంటి ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు తగు న్యాయ సహాయం కోసం మండల్ లీగల్ సర్వీస్ కమిటీని ఆశ్రయించవచ్చని జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు.
అంతకుముందు నర్సాపూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యూనిట్-1లో ఇటీవల శిథిలావస్థలో ఉన్నటువంటి గదులలో చిన్నపిల్లలకు పాఠాలు బోధన జరుగుతున్న విషయం జడ్జీ దృష్టికి రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి నూతన భవన నిర్మాణానికి సంబంధిత అధికారులకు నివేదిక అందించడం జరిగింది. కావున పాఠశాలలోని శిథిలావస్థ భవనాలను కూల్చివేస్తున్న తరుణంలో వాటిని జూనియర్ సివిల్ జడ్జి హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటంకం జరుగకుండా ప్రమాదకర గదుల నుండి సురక్షిత గదులలో పాఠాలు బోధించాలని అలాగే నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎంఈవో తారాసింగ్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది స్వరూపరాణి, అధ్యాపకులు, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also :
Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో