Israel warning : ఇరాన్ నూతన సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Ayatollah Mojtaba Khamenei) ని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక చేసింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని పేర్కొన్నది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై తమవద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది.
మొజ్తాబా ఎక్కడున్నారన్న దానిపై మావద్ద ప్రస్తుతం సమాచారం లేదని, కానీ మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపమని ఇరాన్ రక్షణ దళాల ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ అన్నారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు తమ నుంచి తప్పించుకోలేరని, వారిని తరిమి తరిమి అంతం చేస్తామని వ్యాఖ్యానించారు. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోయినా తమ టార్గెట్ మాత్రం మిస్ కాదని డెఫ్రిన్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే అమెరికా, ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. ఇదొక కొత్తతరహా మానసిక యుద్ధమని, ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, దాక్కోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారని ఇరాన్ ధ్రువీకరించింది.