సిద్దిపేట అర్బన్, జూలై 18 : “నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని.. జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు నేర్చుకోవడమనేది చాలా ముఖ్యం” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల పునశ్చరణ తరగతుల ప్రారంభంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా మొదటి రోజు సమాచార హక్కు చట్టం 2025 అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి, భాషా తప్పు ఒప్పులు-దిద్దుబాటు అనే అంశంపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు, వార్త కథనాలు, ప్రత్యేక కథనాలు అనే అంశంపై దిశ పత్రిక ఎడిటర్ మార్కండేయ బోధించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ నాయకులకు నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. సామాజిక అంశాలపై జర్నలిస్టులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని కదిలించే వార్తలపై జర్నలిస్టులు దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడదారి పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ఇండ్లపై లోన్ తీసుకొని ఆర్థికంగా నష్టపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందన్నారు. జర్నలిస్టులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు.
సిద్దిపేట జర్నలిస్టులకు తన సొంత డబ్బులతో రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భేషజాలు లేకుండా రాజకీయంలో ఎదిగిన వ్యక్తి హరీశ్‌రావు అని, రాజకీయ నాయకులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, లేకుంటే రాజకీయంలో ఇబ్బందులు తప్పవన్నారు. హరీశ్‌రావు ఆరోగ్య మంత్రిగా పని చేసినప్పుడు జర్నలిస్టులకు ఎన్నో సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. మీడియా రంగంలో రోజు రోజుకు మార్పులు వస్తున్నాయని, జర్నలిస్టులు నిత్య విద్యార్థుల వలే ఉండాలన్నారు. శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.