గజ్వేల్ అర్బన్, సెప్టెంబర్ 25 : విద్య, క్రీడారంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, విద్య, క్రీడాహబ్లకు గజ్వేల్ నిలయంగా మారిందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని మినీస్టేడియంలో సోమవారం తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్అహ్మద్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో విద్య, క్రీడారంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనమైన విజయాలు సాధించామన్నారు. గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ లు, క్రీడాహబ్లతో విద్య, క్రీడలకు కేంద్రంగా మారిందన్నారు. జిల్లాలోని గజ్వేల్ ప్రాంతంలో అటవీ, ఉద్యానవన యూనివర్సిటీలతోపాటు మెడికల్ కళాశాలల ఏర్పాటుతో విద్యలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఈ ప్రాంత విద్యార్థులతోపాటు ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చి తెలంగాణలో విద్యాభ్యాసం చేయడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. దేశంలో మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను స్థాపించిన మొదటి సీఎం కేసీఆరేనన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ముందుచూపుతో వ్యవసాయం, వాణిజ్యం, విద్య, వైద్య, క్రీడ, సాంస్కృతిక, పర్యాటక తదితర అన్నిరంగాల్లో జిల్లాలో విప్లవాత్మక అభివృద్ధి జరిగిందన్నారు. క్రీడాకారులు గెలుపోటములు పక్కన బెట్టి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆడాలని, భవిష్యత్‌లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాపోటీల్లో గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్, మెదక్, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్, అందోల్, కోహీర్, పటాన్చెరు, కోహీర్ ఆల్గోల్ మైనార్టీ గురుకుల పాఠశాలల, కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు జాఫర్‌ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు బబ్బూరి రజిత, ఉప్పల మెట్టయ్య, విజిలెన్స్ అధికారి గౌస్, గజ్వేల్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, గజ్వేల్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి, వార్డెన్ ఫాతిమా, పీఈటీ మమత, పాఠశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పీఈటీలు, విద్యార్థినులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, హ్యాండ్‌బాల్, చెస్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనుండగా, మొదటిరోజు కబడ్డీ, ఖోఖోపోటీలు నిర్వహించారు.