హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్‌లో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను భాగస్వాములు చేయాలని వ్యవసాయాధికారులకు డిప్యూటీ సీఎం, ఆర్థిశాఖ మంత్రి భట్టి విక్రమార సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూలసాగు చేయించి ఆ ఉత్పత్తులకు మారెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయశాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రైతు వేదికలు, వ్యవసాయ మారెట్, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటుచేసుకొని విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవస్థతో వ్యవసాయశాఖకు విద్యుత్తు ఖర్చులు మిగులడంతోపాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించి ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు రెడో సంస్థను సంప్రదించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.