రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18 నుంచి ప్రారంభమవుతుందని, గ్రామాలు, మున్సిపల్, వార్డుల వారీగా శిబిరాల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అవసరమైన మేర వైద్య బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, వంద రోజుల్లో కార్యక్రమం పూర్తయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సాధారణ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగొద్దని, కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్త్రృత ప్రచారం నిర్వహించాలన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కండ్లద్దాలు అందజేయాలని పేర్కొన్నారు. మెదక్జిల్లాలో 40 బృందాలు పాల్గొంటాయని, సంగారెడ్డి జిల్లాలో 67 టీమ్‌లు ఏర్పాటు చేశామని, 17,11,678 మందికి కంటి పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్లు హరీశ్, శరత్‌లు మంత్రికి తెలిపారు.
– మెదక్ , (నమస్తే తెలంగాణ) /సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 6
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 18 నుంచి రెండో విడత ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 100 పని రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూలును పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యశాఖ అధికారుల సమన్వయంతో సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలోని జనాభాకు అనుగుణంగా అవసరమైన మేరకు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రతి బృందంలో ఒక డాక్టర్, అప్తోమెట్రిస్ట్, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీహెచ్‌వోలు ఉండేలా చూసుకోవాలన్నారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించేలా చూడాలన్నారు. అవసరమైన సామగ్రి, రీడింగ్ కళ్లద్దాలను జిల్లాకు పంపుతామని పేర్కొన్నారు. వాటిని పీహెచ్సీ ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. పరీక్షల అనంతరం రీడింగ్ కళ్లద్దాలు, అదేరోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్లద్దాలు 15 రోజుల్లో సంబంధిత ప్రజలకు అందజేస్తామని మంత్రి వివరించారు. జిల్లాలో అప్తామాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తి చేసి, జాబితా అందజేస్తే సరోజినీ కంటి దవాఖాన, ఎల్వీ ప్రసాద్ ల్యాబ్‌లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకాలు చేపట్టి జిల్లాస్థాయిలో శిక్షణ అందించాలని కలెక్టర్‌కు సూచించారు.
సాధారణ వైద్య సేవలకు అంతరాయం లేకుండా..
కంటి వెలుగు కార్యక్రమం కింద వైద్య శిబిరాల ఏర్పాటుతో సాధారణ వైద్య సేవలకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతనంగా 959 మంది వైద్యుల నియామకం వారం రోజుల్లో పూర్తవుతుందన్నారు. అదనంగా ఆర్బీఎస్కే వైద్యులను, ఆయుష్ వైద్యులను వినియోగించుకోవాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రజాప్రతినిధులను ఎక్కువగా భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజలు కంటి వెలుగు శిబిరాలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో షెడ్యూల్, మైక్రో ప్లానింగ్ పూర్తి చేసిన తరువాత, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కంటి వెలుగు కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు గుర్తించాలన్నారు. అసవరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో నిర్వహించే కార్యక్రమ వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 69 బృందాలు ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో 69 బృందాలను ఏర్పాటు చేశామని మంత్రికి వివరించారు. జిల్లాలో 17,11,678 మంది జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. 647 గ్రామ పంచాయతీలు, 199 మున్సిపల్ వార్డులు, 7 జీహెచ్ఎంసీ ఏరియాలు ఉన్నాయని వివరించారు. రూరల్‌లో 41, అర్బన్‌లో 16, జీహెచ్ఎంసీ పరిధిలో 6, బఫర్‌గా 6 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఈ రోజే మైక్రో ప్లానింగ్ చేస్తామన్నారు. జిల్లాలో కంటి వెలుగు విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, డీఎంహెచ్‌వో డాక్టర్ గాయత్రీ దేవి, డాక్టర్ శశాంక్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం
మెదక్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రెండో విడత కంటి వెలుగు కార్యక్రంపై మంగళవారం మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లకు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ నుంచి కలెక్టర్ హరీశ్, మెదక్ జిల్లా కేంద్రం నుంచి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వైద్యాధికారి చందునాయక్, డిప్యూటీ వైద్యాధికారి విజయనిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కి వివరించారు.
జిల్లాలో 5 మంది రెగ్యులర్ ఆప్తోమెట్రిస్ట్లకు దరఖాస్తులు ఆహ్వానించామని త్వరలో వారిని నియామకం చేస్తామని తెలిపారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు, ఆయుష్ వైద్యులు రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం వైద్యులు కలిపి మొత్తం 52 మంది వైద్యులున్నారని, 270 మంది ఏఎన్ఎంలు, 560 మంది ఆశాకార్యకర్తలు అందుబాటులో ఉన్నారని ఆయన తె లిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డాక్టర్ నవీన్, ఇన్చార్జి డీపీవో రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు జానకీరామ్ సాగర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.