చేర్యాల, డిసెంబర్ 29 : అన్ని అర్హతలు ఉన్న సిద్దిపేట జిల్లా చేర్యాలను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు జీరో అవర్లో ఆయన మాట్లాడారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీక్ష చేశారని, భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్కుమార్ దీక్షకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలో చేర్యాలను సైతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలన్నారు.
రెండేండ్లలో మూడుసార్లు డివిజన్ ఏర్పాటు అంశం పై అసెంబ్లీలో ప్రస్తావించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. మాజీ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, చాలామంది మాజీ సర్పంచ్లు పేద వారు ఉన్నారని, వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బిల్లులకు క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా పలుమార్లు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడడంతో చేర్యాల ప్రాంతంలోని ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ఆయనకు అభినందనలు తెలిపాయి.ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తున్నారని, అధికార కాంగ్రెస్ సైతం డివిజన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తే వెంటనే ఏర్పాటవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.