జనగామ/ చేర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నా సీఎం కేసీఆర్ వద్ద నుంచి అవసరమైన నిధులు తెచ్చి స్వచ్ఛమైన తాగునీటిని పట్టణ ప్రజలకు అందించడమే తొలి ఎజెండాగా పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా వెళ్లమన్నప్పుడు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు వెళ్తే అందరూ ఆశీర్వదిస్తున్నారని, ఈ ప్రేమ, అభిమానం, నమ్మకం, విశ్వాసం తన మీద కాదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పైన అని తెలుసుసన్నారు.
నా ముఖం తెలియకపోయినా ప్రేమతో, ఆప్యాయతతో స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ చేతులెత్తి, శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. జనగామ జిల్లా ఇచ్చారు.. ఇక్కడికి రైతులకు సాగునీరు ఇచ్చారు.. మెడికల్ కాలేజీ ఇచ్చారు.. ఇంకా ఏం కావాలో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. చాలామంది కేసీఆర్ సిద్దిపేట నుంచి సూర్యాపేట బయలుదేరారని తెలిస్తే వేలమంది ఉసిల్లపుట్టలాగా వచ్చి ఆయన వెంట నడిచేవాళ్లు అని గుర్తుచేశారు. పోరాటాల గడ్డ జనగామ.. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరి ఉద్యమం, తొలి, మలిదశ పోరాటంలో ముందున్న ప్రాంతం.. కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన నాడు కూడా సిద్దిపేటకు ఆనుకొని ఉన్న జనగామ మీ వెంట నడించిందని పల్లా గుర్తుచేశారు. జనగామ, చేర్యాల ప్రాంతం కలిపి నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత సిద్దిపేట, గజ్వేల్‌లో ఈ ప్రాంతం ఒదిగినట్లు ఉంటదని చెప్పారు.
భౌగోళికంగా, మానసికంగా జనగామ ప్రాంతం మీకు ఒదిగి ఉంటుందని.. ఈ ప్రాంతానికి ఏం కావాలో కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, బొమ్మకూరు ద్వారా ఇస్తున్నారని, ఎక్కడైతే పంట కాల్వలు, చెక్‌డ్యాంలు, మినీ లిఫ్ట్‌లు కావాలో వాటన్నింటినీ ఇవ్వాలని జనగామ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు. జనగామకు మెడికల్ ఇచ్చారని దానితో పాటు నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. జనగామలో నీళ్లు వస్తున్నవి కానీ వాటిని మంచినీళ్లుగా భావించి ఎవరూ తాగడం లేదని.. చీటకోడూరు రిజర్వాయర్‌ను బాగుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. బాగా అభివృద్ధి చెందుతున్న జనగామకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రంగప్ప చెరువు అభివృద్ధి, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, డీసీపీ ఆఫీస్, స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాలని.. బచ్చన్నపేట, చేర్యాల, నర్మెటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కావాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
జనగామ ప్రాంతంలో అత్యధికంగా పాల ఉత్పత్తి, రికార్డుస్థాయిలో వరి ధాన్యం పండే ప్రాంతం జనగామ అని, పామాయిల్ పంటలు కూడా బాగా వేస్తున్నారని, సీతాఫలాలు, చింతగింజలు ఎక్కువ లభించే జనగామలో యువత కోసం గ్రోత్ సెంటర్లో సెంటర్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, ధూళ్మిట్ట మండలాలను కలిపి చిన్నదైనా సరే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చేర్యాలలో ఫైర్‌స్టేషన్, మినీస్టేడియం, పట్టణాభివృద్ధి, పెద్ద చెరువు, కొమురవెల్లి మల్లన్న చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. గజ్వేల్, సిద్దిపేట అభివృద్ధిని చూసిన జనగామ ప్రజలు వాటిలాగా తమ జిల్లా కూడా కావాలని ఆశిస్తున్నారని, వారి అభీష్టం మేరకు తీర్చిదిద్దాలని పల్లా కోరారు.