సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, రూ.2.50కోట్లు వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రూ.6 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను ఆగస్టు వరకు పూర్తి చేసి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది నాటిన 1.87 లక్షల హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేయగా, త్వరలోనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మించి స్వచ్ఛ జహీరాబాద్‌కు కృషి చేశారు.
జహీరాబాద్, మే 22: హరితహారం, పట్టణ ప్రగతి అమలులో ముందున్న జహీరాబాద్ బల్దియా, ఎర్లీబర్డ్ పన్ను వసూలులోనూ టాప్‌లో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 147 బల్దియాల్లో ఎర్లీబర్డ్ పన్ను వసూలుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా, 67 శాతం వసూలుతో జహీరాబాద్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో బల్దియా పాలకవర్గాన్ని, యంత్రాంగాన్ని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
రూ.6 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు ముమ్మరం చేశారు. హరితహారంలో గత ఏడాది 1.87 లక్షల మొక్కలు నాటించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి పచ్చని చెట్లు పెంచేందుకు ప్రజలను ప్రోత్సహించారు. గతంలో మున్సిపల్‌కు ప్రతినెలా రూ.40 లక్షల కరెంట్ బిల్లులు వచ్చేవి. మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి సుభాశ్‌రావు కరెంట్ బిల్లులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో సర్వే చేసి, కరెంట్ బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. బోరు మోటర్లకు, ప్రైవేట్ వెంచర్లకు మున్సిపల్ నుంచి కరెంట్ సరఫరా చేయడంతో బిల్లులు ఎక్కువగా వచ్చాయని తెలుసుకుని, వెంటను ఆ కనెక్షన్లు తొలిగించారు. ప్రతినెల రూ.40 లక్షలు వస్తున్న కరెంట్ బిల్లులను రూ.23 లక్షలకు తగ్గించారు. కరెంట్ బిల్లులు తగ్గించడంతో ఏడాదికి మున్సిపల్‌కు రూ.2 కోట్లు ఆదా ఆయ్యాయని అధికారులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు టెండర్లు వేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మాణిక్‌రావు కృషి చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పర్యవేక్షణలో అభివృద్ధి, సంక్షేమ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
పన్ను వసూలులో ప్రథమ స్థానం
జహీరాబాద్ మున్సిపల్లో 37 వార్డులు ఉండగా, 1.10 లక్షల జనాభా ఉంది. కాగా, మున్సిపల్ కమిషనర్ వార్డుల వారీగా పన్ను వసూలు చేసేందుకు అధికారులను నియమించి, 67శాతం పన్ను వసూలు చేయడంతో జహీరాబాద్ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువగా పన్ను వసూలు చేసి బల్దియాకు గుర్తింపును తీసుకువచ్చారు.
పట్టణ ప్రగతిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘పట్టణ ప్రగతి’లో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేసింది. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేసేందుకు ప్రధాన్యత కల్పించారు. ప్రధాన రోడ్డు వెంట మురుగు నీటి కాల్వలు నిర్మాణం చేశారు. ఆదర్శనగర్‌లో బైపాస్ వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. అదేవిధంగా ప్రధాన వార్డులో సీసీ రోడ్లు నిర్మాణం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
వందశాతం హరిత హారం విజయవంతం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో వందశాతం మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రధాన రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు పెంచి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. రంజోల్ శివారు నుంచి జహీరాబాద్ ఈద్గామైదానం వరకు డివైడర్ మధ్యలో మొక్కల పెంపకం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పార్కులు, ఖాళీ స్థలాల్లో హరితహారంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లు పక్కన, పార్కులు, ఖాళీ స్థలంలో నాటేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ప్రతి ఇంటి ముందు పండ్ల మొక్కలు నాటేందుకు ఉచితంగా పంపిణీ చేశారు.
మున్సిపల్లో అభివృద్ధికి కృషి
జహీరాబాద్ మున్సిపలిటీలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగిస్తున్నారు. హరతహారంలో వందశాతం మొక్కల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఎర్లీబడ్ స్కీంలో ఐదు శాతం రిబేట్‌తో పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం.
– సుభాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ జహీరాబాద్