గజ్వేల్, ఏప్రిల్ 10: సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కేసీఆర్ వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కర్కపట్ల కెనాల్ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని సూచించారు.
ఆలేరు కెనాల్ నుంచి సాగునీటిని మర్కూక్ మండల పరిధిలోని కర్కపట్ల వద్ద నీటిని విడుదల చేస్తే కాలువ పక్కన రైతులు సాగు చేసిన వరిపంటకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి కర్కపట్ల వద్ద కెనాల్‌ను పరిశీలించి నీటిని విడుదల చేయించారు.
దీంతో ములుగు మండల పరిధిలోని కొట్యాల, అల్లీనగర్, అడవీమజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తి సింగాయిపల్లి గ్రామాల రైతులు కాలువ పక్కన సాగు చేసిన వరి పంటలకు ప్రయోజనం కలుగుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు కెనాల్లోకి నీటి విడుదల కొనసాగింది. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించిన గులాబీ అధినేత కేసీఆర్‌కు ఆయా గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.