ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్‌గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూగర్భజలాల కొరతతో రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఉపాధి లేక పొట్టకూటి కోసం వందల మంది వలస బాట పట్టారు. క్రషింగ్ సీజన్లో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు కుటుంబాలతో సహా వెళ్లేవారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వలసలకు అడ్డుకట్ట వేశాయి. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు, మిషన్‌కాకతీయతో రైతుల జీవితాల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. అన్ని రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపుతున్నారు. పేద విద్యార్థుల కోసం నియోజకవర్గంలో ఎనిమిది గురుకులాలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో వలసలను పూర్తిగా నివారించి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
– నారాయణఖేడ్, ఆగస్టు 20
పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో.. నా ముసలితల్లి ఏమిబెట్టి సాధుతుందో.. పూటపూట జేసుకోని బతికెటోళ్లం.. పూట గడువా ఇంత దూరం వచ్చినోళ్లం.. అంటూ ఓ సినీ కవి వలస జీవితాలను కళ్లకు కట్టినట్లు చెప్పిన వైనం. పూట గడువక ఏడాదికి ఆరు నెలలు పక్క జిల్లాలు, రాష్ర్టాలకు వలస పోయిన ఖేడ్ ప్రజల జీవితాలు తెలంగాణ వచ్చినంక సంక్షేమం, అభివృద్ధి పథకాలు వలసలను తరిమాయి. ఒకప్పుడు నారాయణఖేడ్ అంటే వలసలు, వెనుకబాటుతనం. రాష్ట్ర సరిహద్దు జిల్లాలో మారుమూలన ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. సమైక్య రాష్ట్రంలోని పాలకులు ఈ నియోజకవర్గంపై వివక్ష చూపి వెనకబాటు పాపాన్ని మూట గట్టుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలసల నివారణకు, వారి పిల్లలకు ఆసరాగా నిలిచాయి. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఇప్పుడు వలసలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దశాబ్దాల తరబడి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న వలస భూతం వదిలిపోతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
నారాయణఖేడ్, ఆగస్టు 20: నారాయణఖేడ్ గిరిజనుల ఖిల్లా.. రాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. నియోజకవర్గంలోని 210 తండాల్లో దాదాపు 70 శాతం మంది గిరిజనులు నివసిస్తారు. చెరుకు క్రషింగ్ సీజన్ వచ్చిందంటే రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని షుగర్ ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు ఇక్కడి నుంచి భారీగా వలస వెళ్లే దుస్థితి ఉండేది. అత్యధికంగా గిరిజనులే వలస వెళ్లే పరిస్థితులు ఉండేవి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఆరు నెలల పాటు అక్కడే నివసించేవారంటే అతిశయోక్తి కాదు. ఏటా అక్టోబర్‌లో వలస వెళ్లిన ఇక్కడి నిరుపేద కూలీలు మార్చి వరకు ఆయా షుగర్ ఫ్యాక్టరీల్లో పని చేసేవారు. తిరిగి మార్చిలో తమ తండాలకు చేరుకునేవారు. గిరిజనులు వలస వెళ్లిన ఆరు నెలల కాలాన్ని ఇక్కడి వ్యాపారస్తులు డల్ సీజన్‌గా పేర్కొనేవారంటే వలసల ప్రభావం మార్కెట్‌పై ఏ మేరకు ఉండేదో అంచనా వేయవచ్చు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంటల సాగు వివరాలు
2014 116295 ఎకరాలు
2024 206519 ఎకరాలు
ఈ ప్రభావం మార్కెట్లో క్రయ విక్రయాలపైనే కాదు విద్యార్థుల చదువుపైనా ఉండేది. ఆరు నెలలు వలస వెళ్లే తమ తల్లిదండ్రులు తమ వెంట పిల్లలు కూడా తీసుకెళ్లడంతో వారి చదువుకు అంతరాయం కలిగేది. లేదా అర్ధాంతరంగానే చదువు చాలించేవారు. వలసలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు ఆ వలస పిల్లల కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక హాస్టళ్లు సైతం నిర్వహించాయి. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం కల్గించిన చర్యలే తప్పా శాశ్వత పరిష్కారం మాత్రం కనించలేదు. ఇదంతా గతించిన కాలం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వలసల నివారణ చర్యలు, వలస పిల్లలకు ఆసరాగా నిలుస్తున్న పథకాలు విజయవంతమయ్యాయి. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఇప్పుడు వలసలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ప్రభుత్వ చర్యలే నివారణోపాయాలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే వలసలను నిలువరించే నివారణోపాయాలుగా ఉపకరిస్తున్నాయి. పదుల సంఖ్య లో భూములు కలిగిన భూస్వాములు కూడా బతుకుదెరువు కో సం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పరిస్థితులు ఉండేవి. ఇక చాలీచాలని భూములు కల్గిన రైతుల దుస్థితి ఏ పాటిదో చెప్పనక్కర్లేదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అత్యధిక శాతం భూములు వ్యవసాయానికి అనుకూలించకపోవడం, సాగు నీటి వనరుల లేమి, భూగర్భ జలాల కొరత వంటి ప్రతికూల పరిస్థితులు వలసలకు ఊతమిచ్చాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రోజు రోజుకు కుంటుపడుతున్న వ్యవసాయానికి కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు చేయి అందించిన ఫలితంగా సహజంగానే వలసలు తగ్గుముఖం పట్టాయి.
మిషన్ కాకతీయ పథకంతో కుంటుపడిన చెరువులను పునరుద్ధరించడంతో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. సాగునీటి వనరులు లేకపోవడం, ఉన్న వాటిలో నీరు నిల్వ ఉండని పరిస్థితుల్లో వందల అడుగుల లోతుల్లో బోర్లు వేసినా ఫలితం దక్కని పరిస్థితి ఉండేది. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు అభివృద్ధి చెంది కొన్నేండ్లుగా బోర్లలో భారీగా నీరు పడడం కూడా వలసల నివారణకు ఒక కారణం. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్న కారణంగా బోరుబావులతో వ్యవసాయం చేసే రైతులకు ఊరట లభిస్తున్నది. దీంతో ఏటా వలస వెళ్లే వారు కూడా సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటికీ తోడు పంట పండించేందుకు వ్యాపారులు వద్దకెళ్లి అప్పులు తెచ్చే పరిస్థితి నుంచి రైతుబంధుతో విముక్తి కలగడం. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10 వేలు అందజేయడంతో రైతుల వలసలకు స్వస్తి పలికేందుకు ప్రధాన కారణమైంది. దీంతో రైతులు వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తూ, సాగుకు నడుంకట్టడంతో వలసలు తగ్గుముఖం పట్టాయనేది వాస్తవం. పంటకు మద్దతు ధర, రైతు కుటుంబాలకు రైతు బీమాతో భరోసా కల్పించడంతో తమ భూముల్లో పంటలు పండిస్తూ ఇతరులకూ పని కల్పిస్తున్నారు.
ఇక్కడ పనికి ఇతర రాష్ర్టాల కులీలు
నారాయణఖేడ్‌లో పని దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితుల నుంచి ఇక్కడ పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి పని కల్పించే స్థాయికి ఎదగడం. స్థానికంగా సాగు విస్తీర్ణం పెరగడంతో సహజంగానే వ్యవసాయ కూలీలకు ఇక్కడే పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం పట్టేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలోనే సాగు విస్తీర్ణాన్ని బేరీజు వేసుకుంటే 2014లో 1,16,295 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, 2022-23 సంవత్సరంలో 2,06,519 ఎకరాలకు పెరిగింది. అదనంగా 90,224 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయాన్ని అధికారిక లెక్కలే ధ్రువీకరిస్తున్నాయి. గతంలో ఒకటి రెండెకరాల భూములు కలిగిన చిన్న రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోగా, ఇప్పుడు మాత్రం ఎవరి భూములను వారే సాగు చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది. కర్నూలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్ నుంచి కూలీలను ఇక్కడికి తరలించి వ్యవసాయ పనులకు వినియోగించుకునే అనివార్యత నెలకొన్నది. ఒకప్పుడు ఇక్కడి నుంచి వలస వెళ్లే పరిస్థితి నుంచి ఇక్కడికి ఇతర ప్రాంతా ల వారు వలస వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.
పారిశ్రామికీకరణ వైపు అడుగులు
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికీకరణ వైపు అడుగులేస్తున్నది. రెండు మూడేండ్లుగా నియోజకవర్గంలో పత్తిమిల్లులు, రైస్‌మిల్లులు ఏర్పాటు చేస్తున్నది. నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగి పంటలు విస్తారంగా పండడం, సాగునీటి వనరులు అభివృద్ధి చెందడంతో ఇక్కడి రైతులు అత్యధికంగా పత్తి, వరిపంటలు పండిస్తున్నారు. దీంతోపాటు రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తున్నది. నిరుపేద కూలీలకు పనులు దొరుకుతున్నాయి. ఇన్నాళ్లు లేని పత్తిమిల్లు, రైస్‌మిల్లులు ఇప్పుడిప్పుడే ఏర్పాటు కావడం వెనుక కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి ఉన్నది.
రోడ్ల నిర్మాణంతో మరింత అభివృద్ధి
నారాయణఖేడ్ నుంచి అన్ని మండల కేంద్రాలతో పాటు అన్ని ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి డబుల్ లేన్ రోడ్లుగా మార్చడం కూడా పరిశ్రమల కల్పనకు నాంది పలికింది. వ్యవసాయాధారిత పరిశ్రమలకు కావాల్సిన అనుకూలతలన్నీ అందుబాటులోకి తెచ్చిన ఫలితంగా ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పత్తి, రైస్‌మిల్లులు ఏర్పాటైన పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారం చేసుకునే మరికొంత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. రానున్న రోజుల్లో పారిశ్రామికీకరణతో నియోజకవర్గంలో భారీ పరిశ్రమల కల్పన వైపు బాటలు పడుతాయనడంలో ఆశ్చర్యం లేదు.
వలస పిల్లల కోసం గురుకులాలు
వలస వెళ్లే వారు తమ పిల్లలనూ తీసుకెళ్లడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగేది. దీంతో వారు చదువులో వెనుకబడడం లేక అర్ధాంతరంగా మానేయడం జరిగేది. కేసీఆర్ ప్రభుత్వం వలసల నివారణకు అవసరమైన చర్యలు చేపడుతూనే, వలస పిల్లలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. అత్యధికంగా గిరిజనులే వలస వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించి నాల్గు ఎస్టీ, రెండు మైనార్టీ, రెండు బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ గురుకులాల్లో దాదాపు 4 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మెరుగైన విద్యాబోధన, నాణ్యమైన భోజనం, కార్పొరేట్ తరహా సదుపాయాలతో చ దువుకునే అవకాశం పేద విద్యార్థులకు కలిగింది.
ప్రభుత్వ చర్యలతోనే వలసలు తగ్గాయి
ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలతోనే నారాయణఖేడ్ ని యోజకవర్గం నుంచి వలసలు తగ్గాయి. వ్యవసాయానికి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియో గం చేసుకుంటున్నారు. సాగు నీటి వనరుల అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రోడ్ల అభివృద్ధి, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు ఇవన్నీ వలస నివారణకు కారణమయ్యాయి. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం, సాగునీటి వనరులు మెరుగుపడి ఒక పంటకు బదులుగా రెండు పంటలు సాగు చేసుకోవడంతో వలసలు ఆగాయి. వలస విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో వలసల నివారణే లక్ష్యంగా మరిన్ని చర్యలు తీసుకుంటాం.
– మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
చెరుకు నరికే పనులకు పోతలేం
ఏటా చెరుకు నరికే పనులకు పోయేటోళ్లం. రెండేండ్ల సంది పోతలేం. మాకు కొంచెం చేను ఉంది. మా చేనులో పని చేసుకుంటున్నం. మా చేనుల పని అయిపోతే వేరోళ్ల చేన్లకు పనికి పోతం. మాకు ఇక్కడనే పని దొరకంగా ఆరు నెలలు వేరే ఊర్లకు పోయి బతికేది ఏం అవసరం. అప్పుడంటే ఎవుసం తక్కువ ఉంటుండే ఇప్పుడున్నంత కూలీల అవసరం ఉండకుండే. ఇప్పుడు ఒకటి రెండెకరాల భూములు ఉన్నోళ్లు కూ డా ఎవుసం చేస్తుండ్రు. దీంతో ఇక్కడనే పని దొరుకుతున్నది. చెరుకు నరకే పనులకు ఇచ్చే కూలీనే ఇక్కడనే దొరుకుతున్నది.
– కర్ర లలితాబాయి, పలుగు తండా, నారాయణఖేడ్
ఎవుసం మస్తు డెవలప్ అయ్యింది
కేసీఆర్ గవర్నమెంట్ అచ్చినప్పటి సంది ఎవుసం మస్తు డెవలప్ అయ్యింది. నాకు ఒక రెండెకరాల భూమి ఉంది. నేను ఏటా ఆరు నెలలు వసల పోయేటోన్ని. పొయిన యాదాది సంది వలస పోతలే. నా భూమిని సాగు చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్ సారు ఎవుసపోల్లకు అన్ని మంచిగ ఇస్తుండు. పంట సాగు కోసం లాగోడు, 24 గంటల కరెంట్ రావట్టే, చెరువులన్నీ మంచిగైనయ్. పంట చేతికొచ్చినంక మంచి ధర ఇచ్చి సర్కారే కొనవట్టే. ఎరువులు, ఇత్తనాలు కూడ అవసరమైనన్ని దొరకవట్టే. ఎవుసపోల్లకు ఏం తక్కువ చేస్తుండు. అన్ని సౌలత్లు అయినయ్. అందుకే నేను నా భూమి సాగు చేసుకుంటా ఈడనే ఉంటున్నా.
– చౌహాన్ సోపాన్, పలుగు తండా, నారాయణఖేడ్