జగదేవపూర్, ఆగస్టు 23: డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నాయిని మహేందర్, పోచమ్మ దంపతుల కుమారుడు శ్రావణ్ (17) గజ్వేల్ పట్టణంలోని విశ్వతేజ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రావణ్‌కు మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో గ్రామంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు.
శుక్రవారం తీవ్రత పెరగడంతో రాత్రి గజ్వేల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు రక్త పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. దవాఖానలో చికిత్స పొందుతూ శ్రావణ్ శనివారం సాయంత్రం మృతిచెందినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మృతిచెందగా డెంగీతో మృతిచెందిన వారి సంఖ్య రెండుకు చేరుకున్నది. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అ న్నారు. శనివారం తిమ్మాపూర్‌ను ఆమె సందర్శించారు. పారిశుధ్య నిర్వహణపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల వెంట వర్షపునీరు నిల్వకుండా చూడాలని, మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోకుండా, ఇండ్ల పక్కన చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటి ని తాగాలని, శుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంరెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎంపీవో ఖాజామోహినుద్ద్దీన్, కార్యదర్శి శైలేశ్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో ఆదివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. డెంగీతో ఇద్దరు మృతిచెందిన విష యం తెలుసుకున్న ఆయన పర్యటించనున్నట్లు తెలిపారు.