సంగారెడ్డి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైల్వేలైన్లు, మెట్రో విస్తరణ, నిమ్జ్, ఆర్ఆర్ఆర్, మెడికల్ డివైజ్ పార్కుకు నిధులు వస్తాయని ప్రజ లు ఆశించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు.
సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్‌కు నిధులు కేటాయింపు పెంచలేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, అటానమన్ వెహికిల్స్ రంగంలో పరిశోధనలకు ఐఐటీ హైదరాబాద్ ప్రాధాన్యత ఇస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ, ఐఐటీ హైదరాబాద్‌కు పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఎ లాంటి నిధులు కేటాయించలేదు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్‌కు బడ్జెట్లో ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల నిధులు కేటాయించేవా రు. ఏటా నిధులు కేటాయింపులు బడ్జెట్లో పెరిగేవి. 2025-26 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఐఐటీహెచ్‌కు నిధులు కేటాయింపు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం తీరుపై పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రైల్వేలైన్ ఊసులేదు.. మెట్రో విస్తరణ ప్రస్తావన లేదు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు చేసేలా రైల్వే బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. నూతన రైల్వేలైన్లు, రైల్వేలైన్ల డబ్లింగ్, రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆశపడ్డారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. సంగారెడ్డిలోని వట్టినాగులపల్లి-జోగిపేట-మెదక్ నూతన రైల్వేలైన్ కోసం సంగారెడ్డి జిల్లా ప్రజలు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో సంగారెడ్డి జిల్లా ప్రజల రైల్వే కల నెరవేరుతుంది. కానీ, కేంద్ర బడ్జెట్లో ఈ రైల్వేలైన్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోలైన్‌ను పొడిగించాలని కోరుతున్నారు.
సంగారెడ్డి నుంచి ప్రతిరోజు జంట నగరాలకు విద్యార్థులు, ఉద్యోగులు,వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. దీంతో మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలని చాలాకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంగారెడ్డికి మెట్రో తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మియాపూర్-ఇస్నాపూర్ మెట్రో విస్తరణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదు.
సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ చేయాలని, జహీరాబాద్‌లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మెదక్ జిల్లాలోని అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ప్రజలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 110 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌పై అన్నివర్గాలు పెదవి విరుస్తున్నాయి.
తెలంగాణపై వివక్ష
కంది, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. కొన్ని రాష్ర్టాలకే బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం దారుణం. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. రాష్ర్టానికి నిధులు తేవడంలో వారంతా విఫలమయ్యారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాలి. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. పబ్లిక్ సెక్టార్ స్థానంలో ఉపాధి కల్పన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. విద్య,ఉపాధి అవకాశాలతో పేదరికాన్ని రూపుమాపవచ్చు. కానీ, వాటికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
ఢిల్లీ, బీహారు రాష్ర్టాల బడ్జెట్
గజ్వేల్, ఫిబ్రవరి 1: ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాలకు బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసి మిగతా రాష్ర్టాలకు మెండిచేయి చూపింది. కేంద్ర బడ్జెట్లో ఏపీతో పాటు త్వరలో ఎన్నికలు జరిగే ఢిల్లీ, బీహారు రాష్ర్టాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం చేశారు. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ర్టానికి నిధులు రాబట్టడంలో వారు విఫలమయ్యారు. కేంద్రానికి మద్దతు పలికిన జనతాదళ్(యూ)బీహారులో గతేడాది రూ.26వేల కోట్లసాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రమిక కారిడర్,నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు పొందారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన బీజేపీ తెలంగాణకు మోసం చేసింది.
– ఎగొండస్వామి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, గజ్వేల్
గిరిజనులకు తీవ్ర అన్యాయం
హుస్నాబాద్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది. వికసిత్ భారత్ పేరుతో విస్తృత ప్రచారం చేసుకుంటున్న కేంద్రం అణగారిన వర్గాలకు కేటాయింపులు నామమాత్రంగా చేయడం విడ్డూరంగా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయాల్సి ఉండగా, 7శాతం ఉన్న గిరిజనులకు రూ. 3,54,574కోట్ల నిధులు కేటాయించే బదులు కేవలం రూ.1,29,249కోట్లు మాత్రమే కేటాయించింది. గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు గతేడాది రూ. 240కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.2కోట్లు కేటాయించడం చిన్నచూపు చూడడమే. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, కేటాయింపులపై ప్రకటన చేయకపోవడం విచారకరం. ఈజీఎస్, ఆరోగ్యం, ఇతర కీలక రంగాలకు ఆశించిన కేటాయింపులు లేవు. కార్పొరేట్లు, బడా కాంట్రాక్టర్లు, ధనవంతులకు ఉపయోగపడే రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు.
– బీమాసాహెబ్ , తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హుస్నాబాద్
ఉద్యోగులను మోసం చేసే బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకు నిరాశను మిగిల్చింది. బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ట్యాక్స్ లేదని మరోసారి కేంద్రం ఉద్యోగులను మోసం చేసింది. కేంద్రం 7, 8వ వేతన సవరణ సంఘం వేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి ట్యాక్స్ రూపంలో తిరిగి వసూలు చేస్తున్నది. రూ.12 లక్షల కంటే ఎకువ జీతం ఉన్నవారు రు. 50 నుంచి రూ.75,000 ట్యాక్సు కట్టే పరిస్థితి వచ్చింది. గృహ రుణాలు తీసుకున్న వారికి వడ్డీ, అసలు మొత్తానికే ట్యాక్స్ డిడికేషన్ కొత్త ట్యాక్స్ విధానంలో తీసివేశారు. ఈ బడ్జెట్ ఉద్యోగులను మోసం చేసేలా ఉంది.
– విక్రమ్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సిద్దిపేట
పేదలపై భారం కార్పొరేట్లకే మేలు
సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్ పేదలపై భారాలు మోపి కార్పొరేట్లకు మేలు చేసేలా ఉంది. పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్లకు పెద్దపీట వేశారు. కార్మిక వర్గానికి, ఉత్పత్తి వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. జిల్లాలో రైల్వేలైన్ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కాకులను కొట్టి గద్దలకు పెట్టేలా బడ్జెట్ ఉంది. ఇప్పటికైనా కార్పొరేట్ల భజన మాని పేదలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగుల మేలు చేసేలా కేంద్రం వ్యవహరించాలి.
– ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి
మొండిచేయి చూపిన బడ్జెట్
కంది, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపిందని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ శనివారం పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన రూ.50,65,345 లక్షల కోట్ల బడ్జెట్లో జిల్లాకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని విమర్శించారు. జిల్లా అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతుందన్నారు. బీహార్‌లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిక నిధులు కేటాయిందని మండిపడ్డారు. జిల్లాలో పరిశ్రమలు వేగంగా పెరుగుతున్నప్పటికీ రైల్వేలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు, దాని కుటమి రాష్ర్టాల అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి పెట్టడం సరికాదన్నారు.
– జయరాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి