పటాన్చెరు రూరల్, మార్చి 9: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని నందిగామ రోడ్డు పక్కన ఉన్న డంపింగ్‌యార్డును ఆమె పరిశీలించారు. భారీ ఎత్తున చెత్త తగలబెడుతుండటంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను అలా తగలబెట్టవచ్చా అని కమిషనర్ వెంకట్కిషన్రావును ప్రశ్నించారు.
24గంటల్లో వాటర్ ట్యాంకర్లు వాడి చెత్తతో చెలరేగిన మంటలను ఆర్పివేయాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ ప్రాంతంలో ఉన్న లెగసీ వ్యర్థ్ధాలను 48గంటల్లో పూర్తిగా తరలించి ఆప్రదేశాన్ని శుభ్రం చేయాలని సూచించారు. డంపింగ్‌యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమంగా చెత్తవేయకుండా 24గంటలు పర్యవేక్షణ ఉండేలా ఒక కార్మికుడిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాలను సేకరించే ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చెత్తను ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారు.? ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుమలత, తహసీల్దార్ పాల్గొన్నారు.
జడ్పీహెచ్ఎస్ను పరిశీలించిన కలెక్టర్
ఇస్నాపూర్ జడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతం, మధ్యాహ్నం భోజనం, పారిశుధ్యం పనులను చూశారు. క్లాసుల్లో విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. పరీక్షలకు రివిజన్ చేస్తున్నారా.? అని ప్రశ్నించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం షెడ్యూల్ సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించిన కలెక్టర్ సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు గుడ్లు అందించడం లేదని గమనించి వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల హెచ్ఎం అనుమతి లేకుండా గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన కలెక్టర్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, కొంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపై ఎంఈవో వివరణ ఇవ్వాలని, పర్యవేక్షణ లోపించినందుకు ఎంఈవోకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యాధికారికి ఆదేశించారు. శానిటైజేషన్ గ్రాంట్ కింద ఎంతమందిని ఎంగేజ్ చేసుకున్నారో, వారి పేర్లు, ఎప్పటి వరకు పేమెంట్ చేశారన్న వివరాలు వెల్లడించాలని ఆమె సూచించారు.