ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతున్నది. అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవినీతి రాజ్యం మేలుతున్నది. పైసలిస్తేనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయి.ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కాంగ్రెస్ కార్యకర్త అయి ఉండాలి, లేదా డబ్బులైనా ముట్టజెప్పాల్సి వస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. నిరుపేదలు ఎన్ని దరఖాస్తులు చేసినా ఇల్లు మంజూరు కావడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సిద్దిపేట, జూన్ 7( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లికి గడ్డం కిష్టయ్య నిరుపేద. వీరికి ఉండడానికి ఇల్లు లేదు.దళితులకు ఇచ్చిన కొద్దిపాటి స్థలంలో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. కుటుం బ సభ్యులు కూలీపని చేస్తేనే పొట్ట గడుస్తుంది.పూరి గుడిసెలో ఉంటున్న అతను అందరిలాగానే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. అర్హుడిని అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని గడ్డం కిష్టయ్య దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇదే దేవక్కపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు రెండు ఇండ్లు ఉన్నాయి. మూడెకరాలకు పైగా భూమి ఉంది. ట్రాక్టర్ ఉంది. ఇతను కాంగ్రెస్ కార్యకర్త కావడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఇలాంటి వారికి ఇల్లు మంజూరు చేసి, అదే గుంట భూమి లేని వారికి ఈ గ్రామంలో ఇల్లు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపిస్తున్నది అనడానికి ఇదే నిదర్శనం. అనర్హులకు అందలం ఎక్కిస్తున్నారు. ఇవి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో జరుగుతున్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు.పేరుకే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారు.కా,నీ అంతా కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన పేర్లు ఫైనల్ అవుతున్నాయి. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఓ నిరుపేద ఇల్లు మంజూరు చేయమని కాంగ్రెస్ నాయకుడి వద్దకు వెళ్తే, ఉన్న ఇల్లు కూలగొట్టుకొని రూ. 50 వేలు తీసుకొని రావాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని బాహాటంగా చెప్పాడు. చేర్యాల మండలంలోనూ ఇలాగే జరిగింది. ఇలా డబ్బులు ఇస్తే వారి పేర్లు ఇందిరమ ఇండ్ల జాబితాలో చేర్చుతున్నారు. అధికారులు కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ జాబితా ఇస్తే అదే జాబితాను ఆమోదించి ఇండ్లు మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశపడ్డ నిరుపేదలకు పరిస్థితులు చూసి నిరాశ చెందుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకుందామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమయ్యేలా లేదని పేదలు నిట్టూరుస్తున్నారు. పైసలు లేనిదే పనులు కావడం లేదంటున్నారు. తొలుతనే డబ్బులు గుంజుతున్న నాయకులు ఇల్లు పూర్తి అయ్యేసరికి ఎన్ని డబ్బులు గుంజుతారోనని పేదలు జంకుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విషయంతో ప్రభు త్వం స్పష్టమైన విధివిధానాలు రూపొందించక పోవడంతో ఇప్పుడు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తొలుత అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు నిబంధనలు మార్చిం ది.ప్రభుత్వం చెప్పిన మాటలతో ఉన్న ఫలంగా ఇంటిని కూలగొట్టి, దాని అడుగులోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసుకున్నారు చాలామంది.కొంత మంది బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసుకున్నారు. తీరా ప్రభుత్వం నిబంధనలు మార్చిం ది.ప్రతి ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధనలతో చాలా మంది ఇండ్లు రద్దు అవుతున్నాయి.
పైగా ఆ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం వద్దని లబ్ధిదారులు విరమించుకుంటున్నారు. ప్రతి లబ్ధిదారుడు 600 చదరపు అడుగుల విస్తీర్ణం లోపలనే ఇంటి నిర్మాణం చేసుకుంటేనే బిల్లులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.దీంతో ఇల్లు కట్టడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. పైగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటామని ప్రమాణ పత్రం రాసి ఇవ్వాల్సి వస్తున్నది. పనికి మాలిన నిబంధనలు పెట్టి తమతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని లబ్ధిదారులు మండిపడుతున్నారు.