నంగునూరు, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. కానీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పురోగతి కరువైంది. లబ్ధ్దిదారులకు అవగాహన కోసం నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇండ్లకే మోక్షం లేని పరిస్థితి నెలకొంది. ఇక అసలు లబ్ధ్దిదారుల పరిస్థితేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో రోజులుగా ఇందిరమ్మ ఇండ్ల కోసం వేచి చూస్తున్న వారు అసలు ఎప్పుడు ప్రారంభిస్తారు అని ఎదురు చూస్తున్నారు.
ఓవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే జరుగుతుంటే సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. శంకుస్థాపన చేసి ఐదు నెలలు గడిచినా బేస్మెంట్ లెవెల్ కూడా దాటని దయనీయ పరిస్థితి ఉంది.
మోడల్ హౌస్ నిర్మాణమే ఇంత నత్తనడకన సాగితే రేపు అసలు లబ్ధిదారులకు నగదు ఇవ్వడంలో ఎంత జాప్యం జరుగుతుందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఇందిరమ్మ ఇండ్ల కోసం వేచి చూడాలో లబ్ధిదారులకు అర్థం కాని పరిస్థితి గ్రామాల్లో నెలకొని ఉంది. మోడల్ హౌస్‌తో పాటు లబ్ధ్దిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.