హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 11: వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు దేశంలో ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు వంటగ్యాస్ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిబాఫూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. కార్యక్రమంలో మంద పవన్, గడిపె మల్లేశ్, జాగీరు సత్యనారాయణ, ఎడల వనేశ్, కొమ్ముల భాస్కర్, జెర్రిపోతుల జనార్దన్, యాద పద్మ, అయిలేని సంజీవరెడ్డి, మల్లారెడ్డి, మాడిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు.