వెల్దుర్తి, జనవరి 22: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేదల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో గొప్పదని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతిరెడ్డిగారి కేశవరెడ్డి జ్ఞాపకార్థం బ్రిటన్‌కు చెందిన శాంతా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎన్ఫీల్డ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్మించిన సైన్స్‌ల్యాబ్, లైబ్రరీని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు విజయ్భాయ్పటేల్, బికుభాయ్పటేల్, శశిబెన్పటేల్, స్మితబెన్పటేల్, డాక్టర్ శ్రీకాంత్, ప్రణతి, మాధవిలతో కలిసి డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలు, ఇన్నోవేషన్లను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో రాధాకిషన్ మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు.
నేడు ప్రభుత్వ బడులు ఎంతో అభివృద్ధి చెందాయని, ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుతూ పాఠశాలలు, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మాసాయిపేట పాఠశాలలో సైన్స్‌ల్యాబ్, లైబ్రరీలతో పాటు ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలు, పుస్తకాలను బహూకరించడం అభినందనీయమన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయ్భాయ్పటేల్, బికుభాయ్పటేల్, డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేని కాలంలో తాము ఎంతో కష్టపడి చదువుకొని విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులు కష్టపడి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, ఉపసర్పంచ్ నాగరాజు, నాయకులు గంగుమల్ల నర్సింహారెడ్డి, సిద్దిరాంలుగౌడ్, నాగరాజులతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.