ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధికారులే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ధూళిమిట్ట పెద్దవాగు ఘోషిస్తున్నది. అనుమతుల పేరు చెప్పి పెద్దవాగులో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో వాగులో ఎక్కడ చూసినా ఇసుక తవ్విన గుంతలే దర్శనమిస్తున్నాయి.
నిత్యం వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా వందల ట్రిప్పుల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతున్నది. ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకొని తీసుకెళ్తుండడంతో పెద్దవాగు అడుగంటింది. బోరుబావుల్లో నీరు రాక పంటలు ఎండిపోతుండడంతో వాగు పరీవాహక రైతులు కంటతడి పెడుతున్నారు. స్థానిక అవసరాలకు ఇసుక కేటాయించాలనే గ్రామస్తుల విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టి ధూళిమిట్టకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 20: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట గ్రామానికి పెద్దవాగే పెద్దదిక్కు. అలాంటి పెద్దవాగుకే ఇప్పుడు పెద్ద ఆపదొచ్చింది. నిన్నమొన్నటి వరకు వాగులో దోసెడు ఇసుక తీస్తే గంగమ్మ పైపైకి గంతులేసేది. వాగునుంచి నీరు వయ్యారులు ఒలకబోస్తూ ఓ సెలయేరుల పొలాల గొంతుతడిపి పసిడి సిరులు కురిపించేది. కాలంతో పనిలేకుండా వాగులో నీరు పారుతూ నిండుకుండలా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాగులో నీటిచెమ్మ లేకుండా ఒట్టిపోయి ఓ ఎడారిలా కనిపిస్తున్నది.
ప్రస్తుతం వాగు పొడవునా ఎటూ చూసినా ‘ఇసుకాసురులు’ చేసిన బీభత్సం ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. పగలూరాత్రీ అనే తేడా లేకుండా పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా పెద్దవాగుపై పెద్దఎత్తున ఇసుక దందా సాగుతున్నది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ వ్యాపారం ‘మూడుపువ్వులు- ఆరుకాయలు’ అన్న చందంగా సాగుతున్నది.
వాగు నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి వాగు పరీవాహక ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. సుమారు 1500 ఎకరాల్లో 300 మందికి పైగా రైతులు పంటలు సాగుచేస్తున్నారు. వాగుపై ఐదు చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఇష్టమొచ్చినట్లు ఇసుక తరలించడంతో ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల్లో నీటిబొట్టు లేకుండా పోయింది. అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యం త్రాంగం తీరుతో ధూళిమిట్ట గ్రామానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
ప్రభుత్వ వాల్టా చట్టం ప్రకారం వాగులోని ఇసుకను ఆయా గ్రామాల ప్రజలు మాత్రమే వాడుకోవాలని స్పష్టంగా చెబుతున్నది. అయిన్నప్పటికీ ఇసుకను బయటి ప్రాంతాలకు తరలిస్తూ కొంతమంది వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఇష్టారీతిన వాగు నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో వాగు ఎండిపోయి సమీపంలోని బోరుబావుల్లో నీరు అడుగంటి పోయే పరిస్థితి నెలకొంది. వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పాటు ప్రభుత్వ పనుల కోసం ధూళిమిట్టలోని పెద్దవాగు నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు అనుమతుల మాటున ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అనుమతి పొంది, పది ట్రాక్టర్లకు పైగా వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు. అనుమతులపై పర్యవేక్షణ లేకపోవడంతో వాగులో ఇసుక ఖాళీఅవుతున్నదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు ఇటీవల గ్రామ పంచాయతీ పాలకవర్గం కొంత ప్రయత్నం చేసింది. గ్రామంలోని ఇసుక గ్రామ అవసరాలకు తప్పా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసింది. తీర్మానం కాపీలను తహసీల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు అందించారు. రైతులు, ట్రాక్టర్ యజమానులతో వేర్వేరుగా కమిటీలు వేసి ఇసుక సంరక్షణకు పంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకుంది. ఓ దశలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయినప్పటికీ ఇసుక దందా ఆగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దవాగులో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో వాగు పక్కనే ఉన్న బోరుబావుల్లో నీళ్లు అడుగంటి పోతున్నాయి. దీనివల్ల పంటలు ఎండిపోయి రైతులంతా నష్టపోతున్నారు. వాగుల్లో చేతిబోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నాం. వాగు చుట్టూ వేల ఎకరాల్లో పంట సాగు అవుతున్నది. ఇసుక తవ్వకాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇసుకను బయటకు పంపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఆలేటి లక్ష్మారెడ్డి, వాగు పరీవాహక రైతు, ధూళిమిట్ట (సిద్దిపేట జిల్లా)
గ్రామంలోని వాగు ఇసుక మా గ్రామ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, ఇతర గ్రామాలకు రవాణా చేయకూడదని గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిం ది. ఈ తీర్మాన పత్రాలు తహసీల్దార్, కలెక్టర్, ఇతర అధికారులకు అందించాం. ఆన్లైన్ విధానం వల్ల గ్రామంలోని వాగు నుంచి అనుమతుల పేరుతో అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల గ్రామంలోని రైతులు నష్టం జరుగుతున్నది. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి మా వాగు నుంచి ఇసుక బయటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు పంచాయతీ పాలకవర్గం సిద్ధంగా ఉంది.
– గునుకుల లీలాజగన్మోహన్రెడ్డి, సర్పంచ్, ధూళిమిట్ట (సిద్దిపేట జిల్లా)