మెదక్, జనవరి 4(నమస్తే తెలంగాణ): అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతుతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది.ఇసుక మాఫియా దోపిడీతో హల్దీవాగుకు కడుపుకోత తప్పడం లేదు. వాగులో ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తుండడంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి హల్దీవాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హల్దీ వాగుతో పాటు ఇతర వాగుల్లో ఇసుక మాఫియా ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్ డివిజన్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. యథేచ్ఛగా ఇసుకను కూలీలతో వాగుల నుంచి తీసుకువచ్చి అడవిలో కుప్పులు పోయించి, రాత్రి సమయంలో ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. హల్దీ వాగుతో పాటు మెదక్ నియోజకవర్గంలో ఉన్న పలు వాగుల నుంచి ఇసుక తోడేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు , మైనింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మెదక్ ప్రాంతంలో ఎన్ని ఇసుక క్వారీలకు అనుమతి ఉందో అధికారులు ప్రకటించడం లేదు. లారీలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అనే పేరుతో హల్దీవాగులో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు తమ అనుచురులతో అక్రమంగా ఇసుక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి సాగు,తాగునీటి కష్టాలు తప్పవని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాగులో ఇసుక అడుగున ఇసుక రేణువులు నీళ్లు ఇంకడానికి సహజ సిద్ధ్ద ఫిల్టర్లుగా పనిచేస్తాయి. ఇసుక మాఫియా విచ్చలవిడిగా ఇసుక తోడివేస్తుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడుతుంది. ఇసుక తోడేయడంతో వాగుల ఒడ్డున ఉన్న చెట్ల వేర్లు బయటపడుతున్నాయి.
మెదక్ కేంద్రంగా ఇసుక మాఫియా దందా సాగిస్తున్నది. వాగుల్లో విచ్చలవిడిగా తవ్వి, ఇసుకను ఓవర్ లోడ్‌తో వాహనాల్లో తరలిస్తున్నా పోలీసులు, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 20 టన్నుల లారీలో అక్రమంగా 40 టన్నుల వరకు తరలిస్తున్నారు. 30 టన్నలు కెపాసిటీ ఉన్న లారీలో 60 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు ఇసుక వ్యాపారంతో రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక పెద్ద ఆదాయ వనరుగా మారింది కొందరికి. మెదక్ నుంచి ఇసుకను హైదరాబాద్, జహీరాబాద్, కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్రమార్కులకు మెదక్‌కు చెందిన అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మెదక్‌రూరల్, జనవరి 4: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఏఎస్సై దయానంద్ హెచ్చరించారు. మెదక్ మండలంలోని సంగాయిగూడ తండా హల్దీవాగు శివారులో ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఏఎస్సై దయానంద్, ఆర్ఐ కిశోర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సత్యనారాయణ, చరణ్, విజయ్ అక్కడికి చేరుకుని ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను, రెండు హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.