జహీరాబాద్, డిసెంబర్ 22: కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానికి కొందరు తెరతీశారు. తెలంగాణలో మద్యం ధర ఎక్కువగా ఉండడంతో పాటు కావాల్సిన బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో లేకపోవడంతో గోవా మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోవా మద్యం సరఫరాకు ఎక్సైజ్ అధికారులు, నాయకుల అండదండలు ఉండడంతోనే ట్రావెల్స్ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రోజూ హైదరాబాద్‌కు మద్యం తరలిస్తున్నారని సమాచారం. దీంతో రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టు ఉన్నా ఎలాంటి తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ఆదాయానికి గండి
గోవా పర్యటనకు వెళ్లి ప్రతిఒకరూ మద్యం తీసుకొస్తారు. తెలంగాణ సరిహద్దులో ఎలాంటి తనిఖీలు చేయడంలే దని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోవాలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని రాష్ర్టానికి తీసుకొచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నారని సమాచారం. దీంతో రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లుతున్నది. ఈ నెల 15న గోవా నుంచి ట్రావెల్స్ బస్సులో విలువైన మద్యాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి 65వ జాతీయ రహదారిపై ఉన్న ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసి 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎక్సైజ్ పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేయగా, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేరు ఇంజినీర్ గోవా నుంచి కారులో హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఉన్న ఒకటిన్నర గ్రాముల సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులు, కారులు తనిఖీలు చేశారు. గోవా నుంచి తీసుకొస్తున్న 28 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి కారు వేగంగా నడుపుతూ వెళ్తుతుండగా నిలిపి, తనిఖీ చేయగా, కారులో 1.5 గ్రాముల ఎండీఐఏ (సింథటిక్ డ్రగ్స్)ను పట్టుకున్నారు.
చెక్‌పోస్టు ఉన్నా తనిఖీలు లేవు..?
మహారాష్ర్ట, కర్ణాటక, గోవా మద్యాన్ని తెలంగాణలోకి రాకుండా నివారించేందుకు జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి గ్రామంలో రాష్ట్ర సరిహద్దు ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ చెక్ పోస్టులో ఇద్దరు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు విధిలు నిర్వహిస్తున్నారు. రోజూ విధి నిర్వహణలో ఉండాల్సిన సీఐలు వారంలో ఒకసారి వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ చెక్‌పోస్టులో రోజూ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కర్ణాటక, మహారాష్ర్ట, గోవా నుంచి వచ్చి వాహనాలను తనిఖీ చేయడంలేదు. దీంతో ట్రావెల్స్ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మద్యం యధేచ్ఛగా తీసుకొస్తున్నా చర్యలు తీసుకునే వారు కనిపించడం లేదు.
మద్యం వ్యాపారులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు అధిక ధరలకు అమ్మకాలు
జహీరాబాద్, కర్ణాటక సరిహద్దులో ఉండడంతో కొంద రు మద్యం వ్యాపారులు గోవా, ఆర్మీ మద్యం బీదర్‌లో కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సిబ్బంది బీదర్‌లో కొని, ఇండ్లలో భారీగా నిల్వ చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అక్రమంగా నిల్వ చేసిన మద్యం ఎవరికంటే వారికి అమ్మరు. నమ్మకమైన వారికి మాత్రమే ఇస్తారు. ఇలా రోజూ లక్షల్లో మద్యం వ్యాపారం నడుస్తున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారు.
ప్రత్యేక తనిఖీలు చేస్తేనే మద్యం, డ్రగ్స్ లభ్యం
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వాహనాలు తనిఖీ చేసేందుకు రాష్ట్ర సరిహద్దులోని చిరాగ్‌పల్లిలో ఎక్సైజ్ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ విధుల్లో ఉన్నవారు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే మొలాసిస్ ట్యాంకర్లను మాత్రమే తనిఖీచేస్తారు. ప్రతి ట్యాంకర్ నుంచి మామూళ్లు వసూలు చేస్తారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి రోజూ ట్యాంకర్లు మొలాసిస్ తీసుకొస్తాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరిహద్దులో ప్రత్యేక తనిఖీలు చేసిన సమయంలో ఇతర రాష్ర్టాల మద్యం లభ్యమవుతున్నది. గురువారం 65వ జాతీయ రహదారి ఉన్న చెక్‌పోస్టు వద్ద సంగారెడ్డి ఎక్సైజ్ అసిసెంట్ సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ సాయన్న, ఎస్సైలు కృష్ణాప్రసాద్, పృథ్విరాజ్, వెంకటేశ్వర్లు, రమేశ్, శాంత, సిబ్బంది వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గోవా మద్యంతో పాటు డ్రగ్స్ లభించాయి.
అక్రమ మద్యం నివారణకు చర్యలు
ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా తెలంగాణలోకి మద్యం రాకుండా ప్రత్యేక తనిఖీలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. గోవా మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్దవాహనాలు తనిఖీ చేయగా గోవా మద్యంతో పాటు డ్రగ్స్ ప్యాకెట్లు లభించాయి. కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాం.
– అశోక్‌కుమార్, ఎక్సైజ్ అసిసెంట్ సూపరింటెండెంట్, సంగారెడ్డి