పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 1 : ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని వేల మంది పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు అందజేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సొంత స్థలం ఉంటే నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం, స్థలం లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తుందన్నారు. ఇటీవల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కొందరు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లలో తిరుగుతూ ఇండ్లు ఇప్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు.
అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని అమీన్‌ఫూర్, పటాన్చెరు సర్కిళ్లలో సర్వే జరుగుతున్నదని, త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేయిస్తామని జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు తెలిపారు. ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800599599కు కాల్ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ సుజాత, ఏఈలు పాల్గొన్నారు.