సంగారెడ్డి, ఏప్రిల్ 23: జిన్నారంలో శివలింగాన్ని కోతులు తోసివేయడంతో ధ్వంసమైనట్లు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనపై పోలీసు శాఖ సమగ్ర విచారణ చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల విచారణలో కోతుల కారణంగానే జిన్నారంలో నిర్మాణంలో ఉన్న శివాలయంలో శివలింగం దెబ్బతిన్నట్లు తేలిందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐజీ సత్యనారాయణ ప్రదర్శించారు.
ఈనెల 19న సాయంత్రం 5.24 గంటల సమయంలో కొన్ని కోతులు వచ్చి శివుని విగ్రహాన్ని గుట్టపై నుంచి కిందికి తోసివేసినట్లు చెప్పారు. కోతులు తోసివేయడంతో శివుడి విగ్రహం ధ్వంసమైందన్నారు. మంగళవారం సాయంత్రం మదర్సా విద్యార్థులు ఆటలు ఆడుకుని శివాలయం ముందు నుంచి వెళ్తున్న క్రమంలో కొంతమంది వారిని చూశారన్నారు. ఆలయంలో శివుని విగ్రహాన్ని మదర్సా విద్యార్థులు ధ్వంసం చేసి ఉంటారని నిర్ణయానికి వచ్చిన కొందరు ఆందోళనకు దిగినట్లు తెలిపారు.
పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది పెద్దసంఖ్యలో మదర్సా వద్దకు వెళ్లి ఘర్షణకు దిగినట్లు చెప్పా రు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని ఐజీ హెచ్చరించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రెగ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిన్నారంలో సమస్య జఠిలం కాకుండా త్వరితగతిన స్పందించిన ఎస్పీ పరితోష్ పంకజ్, మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా పోలీసు అధికారులను ఐజీ అభినందించారు.