Harish Rao | మెదక్, ఫిబ్రవరి 7: (నమస్తే తెలంగాణ): తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లాపూర్ చౌరస్తా నుండి తూప్రాన్ బస్టాండ్ వరకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్ అభివృద్ధిని గుర్తు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు.
ఒకప్పుడు తూప్రాన్‌లో మంచినీళ్లు కావాలంటే మూడు రోజులకోసారి వచ్చేవి. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డం పడి నిరసన తెలిపేవాళ్లు. కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఆడబిడ్డల నీళ్ల కష్టాలు తీర్చారని హరీష్ రావు అన్నారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, ఫోర్ లైన్ రోడ్లు వేసి హైవేలా మార్చింది కారు గుర్తు కాదా..? కేసీఆర్ రాకముందు తూప్రాన్‌కు పిల్లనియ్యాలంటే నీళ్లు మోపిస్తారని భయపడేవాళ్లు. ఇప్పుడు తూప్రాన్‌కే పిల్లనియ్యాలన్నట్టు పరిస్థితి మారింది.పది లక్షలు లేని భూమిని కోటి రూపాయలు చేసింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి చేరాయి.
ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారు.
తూప్రాన్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని హరీష్ రావు అన్నారు. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారు.మీకు ఆధిపత్య రాజకీయాలు కావాలా..? లేక అభివృద్ధి కావాలా..? ఆలోచించండి.రెండేళ్ల నుంచి తూప్రాన్ అభివృద్ధిని అడ్డుకున్నారు. రోడ్లకు గుంతలు పడితే డాంబర్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు.50 పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేక మెదక్, గజ్వేల్ కు పంపుతున్నారు.మహిళలకు రూ. 2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. ఈ 26 నెలల్లో ఒక్కో అక్కకు, చెల్లెకు రూ. 65,000 బాకీ పడ్డాడు.తులం బంగారం ఇస్తానని చెప్పి కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఆపుతున్నాడు.
అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లకు రూ. 2000 పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకుంది కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.కేసీఆర్ ఉన్నప్పుడు పంట పంటకు రైతుబంధు పడేది. కరోనా కష్టకాలంలో కూడా ఆపలేదు.రేవంత్ రెడ్డి రెండు రైతుబంధులు ఎగ్గొట్టాడు. బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్, గొర్రెల పంపిణీ బంద్, చేప పిల్లలు బంద్, దళిత బంధు బంద్.. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నాడు.సద్ది తిన్న రేవు తలవాలి.. మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోవద్దు.
ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించండి..
బీజేపీ వాళ్లు ఓట్ల కోసం గిర్ర గిర్ర తిరుగుతున్నారు. వాళ్లు తూప్రాన్‌కు ఏమైనా చేశారా..? ఒక్క హాస్పిటల్ కట్టించారా..? కల్యాణ లక్ష్మి ఇచ్చారా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. రూ. 15 లక్షలు వేస్తామని 12 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. పువ్వు గుర్తుకు ఓటేసినా, ఓటును మోరీలో పారేసినా ఒక్కటే. అది దండుగ అని ధ్వజమెత్తారు.అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు.హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడు.
తులం బంగారం ఏది అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు.ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా..? ఇలాంటి బూతుల ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి. ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించండి. రెండేళ్ల తర్వాత వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే. తూప్రాన్ అభివృద్ధి బాధ్యత నాది. ఏ పని ఉన్నా నేను చేసి పెడతానని హామీనిచ్చారు.