సంగారెడ్డి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రా యాక్షన్‌కు సిద్ధమవుతున్నది. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటల ఆక్రమణలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు 50కిపైగా చెరువుల సమాచారాన్ని హైడ్రాకు అందజేశారు. తమకు అందిన చెరువులకు సంబంధించిన వాటిల్లో నిబంధనలకు విరుద్ధ్దంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలను హైడ్రా సొంత సిబ్బందితో సర్వే చేయించి గుర్తిస్తున్నది.
ఇలా గుర్తించిన ప్రాం తాల్లోని అక్రమ నిర్మాణాలను తొలిగిస్తున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల అమీన్పూర్, పటాన్చెరులో పర్యటించి చెరువుల ఆక్రమణలను పరిశీలించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం అమీన్పూర్ చెరువులోని ఓ ఆంధ్రానేత నిర్మించిన షెడ్లను మాత్రమే హైడ్రా అధికారులు తొలిగించారు. మిగతా ఎక్కడా హైడ్రా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టలేదు. ఇటీవల హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో ఇక అక్రమ నిర్మాణాల తొలిగింపుపై హైడ్రా దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.
పటాన్చెరులో ఆక్రమణలపై చర్యలు?
హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే పటాన్చెరు,ఆర్సీపురం అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం, సంగారెడ్డి, కంది, హత్నూర మండలాల్లో 666 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో మొదటగా 50కిపైగా చెరువులు, కుం టల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురికావడంతో పాటు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. కొన్ని చెరువులు, కుంటల ఆక్రమణకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు ఇది వరకే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కొన్నిచోట్ల అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అమీన్పూర్ మండలంలోని పోచమ్మకుంట, ఊబకుంట, శెట్టికుంట, బందంకొమ్ము చెరువు, ఉసికెబావి, ఉప్పరివానికుంట, శంభునికుంట, కుమ్మరికుంట, పెద్దచెరువు, కొత్తచెరువు, గాం ధీకుంట, కొనేటికుంటతోపాటు పలు చెరువులు ఆక్రమణలకు గురైనట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. పటాన్చెరు మండలంలోని సాకి చెరువు, చౌదరికుంట, గొల్లకుంట, చౌట్లకుంట, కొమటికుంట, నల్లకుంట, కండ్లకుంట, తెట్టేకుంటతోపాటు పలు చెరువులు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
ఆర్సీపురంలోని నాగులకుంట, చెల్లికుంట, మేళ్ల చెరువుతోపాటు పలుచెరువులు ఆక్రమణలకు గురైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు గుర్తించారు. వీటి వివరాలను హైడ్రాకు అందజేశారు. వీటితోపాటు గుమ్మడిదల, జిన్నారం, హత్నూ ర మండలాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు హైడ్రా అధికారులకు అందజేశారు. నీటిపారుదల శాఖ అందజేసిన ఆక్రమణలను హైడ్రా మరోసారి సర్వే చేసి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముందు నోటీసుల జారీకి అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సంగారెడ్డిలోని చెరువులు ఆక్రమణలపై దృష్టి
సంగారెడ్డి, కంది మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. దీంతో కంది, సంగారెడ్డి మండలాల్లో చెరువుల ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది. సంగారెడ్డి మండలంతోపాటు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆక్రమణకు గురైన 20కిపైగా చెరువుల సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారులు హైడ్రాకు అందజేసినట్లు తెలిసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఎర్రకుంటలో ఆరు ఎకరాలు, మహబూబ్‌సాగర్ చెరువులో 5.40 ఎకరాలు, ఎర్రకుంట(చౌదరికుంట) పరిధిలో 6.50 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు.
పోతిరెడ్డిపల్లిలోని మాసానికుంట, రాజంపేటలోని తుర్కవోనికుంట, దేవునికుంట, కల్వకుంలోని తిమ్మనికుంట ఆక్రమణకు గురైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు గుర్తించారు. వీటితోపాటు సంగారెడ్డి, కంది మండలాల్లోని ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు సేకరించి హైడ్రా అధికారులకు అందజేసినట్లు సమాచారం.