హుస్నాబాద్, ఆగస్టు 31: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల రూ.2కోట్లతో ఆధునీకరించినప్పటికీ బస్టాండ్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న ఈ బస్టాండ్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. బస్టాండ్ ఆవరణంలో కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేకుండా ఉంది. అధికారుల ముందు చూపు లేకపోవడం, ప్రణాళిక ప్రకారం నిధులు వినియోగించక పోవడంతో బస్టాండ్‌లో వరద, బురద తప్పడం లేదు.
ఇటీవల కురిసిన వర్షానికి బస్టాండ్ మొత్తం జలమయం కావడం, ఆవరణలో నిలిచిన వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక అధికారులు మరిన్ని నిధులు కేటాయించి డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రారంభమై నెల దాటుతున్నా ఇప్పటి వరకు పూర్తి కావడం లేదు. దీంతో బస్టాండ్ ఆవరణ మొత్తం కంకర, మట్టి కుప్పలే దర్శనమిస్తున్నాయి. బస్టాండ్ చుట్టూ డ్రైనేజీ కోసం కందకం తవ్వి వదిలేయడం వల్ల అది ప్రమాదకరంగా మారింది. డ్రైవర్లు బస్సులను బస్టాండ్ ఆవరణలో ఆపేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బురద వల్ల బస్టాండ్ ఆవరణలో కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
కందకాల వల్ల బస్టాండ్ లోపలికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన ద్వారాలు సైతం మూసుకుపోవడంతో ప్రయాణికులు చుట్టూ తిరిగి లోపలికి రావాల్సి వస్తున్నది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు పనులను పూర్తిచేయక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణాశాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఇలాకాలోని బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారుకావడ ంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రూ. రెండు కోట్లతో బస్టాండ్ భవనానికి మరమ్మతులు చేసి సీలింగ్ పనులు పూర్తి చేశారు. భవనం స్లాబ్‌కు కూడా మరమ్మతులు చేసినప్పటికీ వర్షం పడినప్పుడు స్టాబ్ నుంచి నీళ్లు కారుతూ ప్లాట్‌ఫామ్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులపై పడుతున్నాయి. దీంతో బస్టాండ్ ఆవరణ అంతా నీళ్లమయమై పలువురు ప్రయాణికులు జారిపడిన ఘటనలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున నిధులు ఉన్నప్పటికీ పనుల్లో నాణ్యత లోపంతోనే భవనం ఊరుస్తున్నదని, బస్టాండ్ ఆవరణలోనూ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కేటాయించిన రూ.2 కోట్లకు మరిన్ని నిధులు జోడించి పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి బస్టాండ్ ఆవరణ మొత్తం ఎత్తు పెంచినైట్లెతే బాగుండేదని పట్టణానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బస్టాండ్‌లో తరచూ ఏర్పడుతున్న సమస్యలు, అసౌర్యాలను పూర్తిగా పరిష్కరించాలంటే భవనంతో పాటు ఆవరణం ఎత్తు పెంచడమే సరైన పరిష్కారమని ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలు సూచిస్తున్నారు.