దుబ్బాక, సెప్టెంబర్ 25: గూడు లేని నిరుపేదలకు కేసీఆర్ సర్కారులో సొంతింటి కల సాకారమైంది. సమైక్యంధ్ర ప్రభుత్వాలు పేదలను పట్టించుకున్న పాపానపోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదోళ్లకు సొంతింటి కలను నెరవేర్చుతున్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇల్లు అందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలోనే డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరుకావడం విశేషం. దుబ్బాకపై మమకారంతో సీఎం కేసీఆర్ భారీగా డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రత్యేక చొరవ, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాకలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గానికి 3,439 ఇండ్లు మంజూరయ్యాయి. నిర్మించిన ఇండ్లు 90శాతానికి పైగా పేదలకు అందజేశారు. మిగిలిన 10శాతం ఇండ్లు త్వరలోనే లబ్ధిదారులకు అందించనున్నారు. దుబ్బాక పట్టణంలో జీ ప్లస్ టు పద్ధతిలో నిర్మించిన ‘గృహ సముదాయం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిరంతర పర్యవేక్షణలో గ్రామాల్లో రెండు పడకల గదుల నిర్మాణాలు శరవేగంగా కొనసాగాయి. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చారు.
దుబ్బాక నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇండ్లను శరవేగంగా నిర్మిస్తున్నారు. నాణ్యతాప్రమాణాలతో ఇండ్లను నిర్మించి, పండుగ వాతావరణంలో లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశం చేయించారు. నియోజకవర్గానికి 3,439 ఇండ్లు మంజూరు కాగా, మొదట 2,230 గృహాలను ప్రారంభించారు. అనంతరం మరో 1209 ఇండ్లు నిర్మించి, పేదలకు అందజేశారు. గ్రామాల్లో వేగవంతంగా గృహాలు నిర్మించి, దశలవారీగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇండ్ల పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన పేదలను పారదర్శకతతో ఎంపిక చేస్తున్నారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదువుకున్న బడి సమీపంలో బల్వంతాపూర్ రోడ్డులో 11 ఎకరాల్లో వెయ్యి ఇండ్లు నిర్మాణం చేపట్టారు. మోడల్ కాలనీగా 76 బ్లాక్‌లు నిర్మించారు. మల్లాయపల్లి రోడ్డులో మరో 10 బ్లాక్‌లు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్ల చొప్పున వెయ్యి ఇండ్లు నిర్మించారు. ఇందులో కాలనీ ప్రజల సౌకర్యార్థం కోసం షాపింగ్ కాంప్లెక్స్, రైతుబజార్, కమ్యూనిటీహాల్, చావడీలతో పాటు ఆధ్యాత్మికత కోసం సమ్మక్కసారలమ్మ
ఆలయాన్ని నిర్మించారు.
బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన డబుల్బెడ్రూం ఇండ్ల పథకం గూడులేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. లబ్ధిదారులకు చేతి నుంచి ఒక్క రూపాయి తగలకుండా ఇంటి నిర్మాణం పూర్తియ్యేంతవరకు మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించింది. సకలవసతులతో నిర్మించిన ఇల్లును పండుగ వాతావరణంలో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించడం విశేషం. నియోజకవర్గంలో 2015-16లో 2,666 ఇండ్లు, 2016-17లో 702 ఇండ్లు, సీఎం నిధుల కింద మరో 71 ఇండ్లు, మొత్తం 3,439 ఇండ్లు మంజూరయ్యాయి. దుబ్బాక పట్టణంలో జీ ప్లస్ టు పద్ధతిలో వెయ్యి ఇండ్లు నిర్మించారు. బల్వంతాపూర్ రోడ్డులో 76 బ్లాక్‌లు, మల్లాయిపల్లిలో 10 బ్లాక్‌లు నిర్మించారు. బల్వంతాపూర్‌లో నిర్మించిన 756 బ్లాక్‌ల్లో 912 ఇండ్లతో మోడల్ కాలనీగా అవతరించింది. చిట్టాపూర్, లచ్చపేట, చేర్వాపూర్, దుంపలపల్లి, గంభీర్పూర్, పోతారెడ్డిపేట తదితర గ్రామాల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లు నిర్మించారు. ఇండ్ల నిర్మాణాలతోపాటు కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కల పెంపకం, డ్రైనేజీ, విద్యుత్తు సరఫరా, తాగునీటి కోసం నీటి ట్యాంకులు సకల వసతులు కల్పించారు. దుబ్బా క మున్సిపాలిటీలో ఒక్కో ఇంటి నిర్మాణానికి నిర్మాణ వ్యయం రూ.5.30 లక్షలు, వసతుల కల్పనకు రూ.1.25 లక్షలు ఖర్చవుతుండగా, గ్రామాల్లో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకు నిర్మా ణ వ్యయం రూ. 5.04 లక్షలు కాగా, మౌలిక వసతుల కోసం రూ. 75 వేలు చొప్పున వెచ్చించారు. నిలువ నీడలేక, అద్దె ఇండ్లలో దుర్భరజీవితాలను గడిపిన నిరుపేదలకు బీఆర్ఎస్ ప్రభు త్వం అందించిన డబుల్ బెడ్రూం ఇండ్లు వరంగా మారాయి.
గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా మారింది. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో దుబ్బాక ముందంజలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇండ్లు పక్క నాణ్యణాప్రమాణాలతో నిర్మించారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు, రాజకీయాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో అధికారులకే అప్పగించాం. ఒక్క రూపాయి ఖర్చులేకుండా లబ్ధిదారులకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ సర్కారుకే దక్కింది. దుబ్బాకలో జీ ప్లస్ టు విధానంతో 76 బ్లాక్‌లతో వెయ్యి ఇండ్లు నిర్మించడంతో పట్టణానికే వన్నే వచ్చింది. పట్టణాల్లో అపార్టుమెంట్ తరహాలో కనిపిస్తున్నాయి. ఇందులో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి మరిచిపోలేనిది.
చాలా సంవత్సరాలుగా కిరాయి ఇండ్లలో ఉంటూ ఇబ్బందులు పడ్డాం. మా సంపాదన మొత్తం ఇంటి కిరాయి, ఖర్చులకే సరిపోయేది. ఇక సొంతింట్లో ఉంటామని కలలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్ దయవల్ల మాకు డబుల్బెడ్రూం ఇల్లు వచ్చింది. ఎడాదిన్నర కిందట డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. అప్పటినుంచి మాకు కిరాయి(అద్దె చెల్లింపు) బాధలు తప్పాయి. బ్లాక్‌లో చిన్నపాటి సమస్యలుంటే మేమంతా తల కొన్ని డబ్బులు వేసుకుని చేయించుకుంటున్నాం. ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. మా పేదోళ్లకు డబుల్బెడ్రూం ఇచ్చిన సీఎం కేసీఆర్ సారును రుణపడిఉంటాం.
మాకు డబుల్బెడ్రూం ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా గరీబోళ్లకు సొంతిల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ సాబ్‌కు రుణపడి ఉంటాం. ఇంతకుముందు కిరాయి ఇండ్లలో చాలా సమస్యలు పడ్డాం, ఇక్కడ అన్ని వసతులున్నాయి. మా బ్లాక్‌లో 12 ఇండ్లున్నా యి. అందరికీ నల్లానీళ్లు వస్తున్నాయి. మేమంతా కులమతలకతీతంగా కలిసిమెలిసి ఉంటాం. కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఇల్లుతోపాటు నాకు ఆసరా పింఛన్ వస్తుంది. నేను బీడీలు చేస్తాను, మా ఆయన కూలీ పనులు చేసిన డబ్బులు పొదుపు చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.