గజ్వేల్, నవంబర్ 10: గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత దవాఖాన ప్రాంతంలో రూ.34.22కోట్లతో నూతన మాతాశిశు దవాఖానను నిర్మించారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు భవనంలో కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
గర్భిణులకు రోజూ ఓపీ సేవలు అందిస్తూ వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించిన భవనంలో నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వసతులు కల్పించలేదు. దీంతో పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాక ఓపీ సేవలకు పరిమితమయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాతాశిశు దవాఖానను ప్రారంభించారు. దవాఖాన ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా నేటికీ ఓపీకి తప్పా ప్రసూతి సేవలు అందుబాటులోకి రాలేదు. మాతాశిశు దవాఖానను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు పట్టించుకోకపోవడంతో నూతన భవనంలో ఆపరేషన్ థియేటర్, లెబర్రూమ్లో కావాల్సిన పరికరాలు పూర్తిస్థాయిలో సమకూర్చలేదు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రస్తుత జిల్లా దవాఖానలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రసూతి కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉండాలనే ఉద్దేశంతో నిర్మించిన మాతాశిశు దవాఖాన అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖానలోనే ప్రసూతి సేవలు అందిస్తున్నారు. అన్ని రకాల సేవలు ఒకే దవాఖానలో అందుతున్నాయి.
ప్రతి నెలా దవాఖానలో 250 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతాయి. ఇదే దవాఖానకు రోజు వివిధ ప్రాంతాల నుంచి గర్భిణులు పరీక్షల కోసం వస్తుంటారు. దీంతో దవాఖానలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూతనంగా నిర్మించిన భవనంలోకి మాతాశిశు దవాఖానను తరలిస్తే ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు మాతాశిశు దవాఖానకు సరిపడా పరికరాలు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి దవాఖానను సందర్శించి గర్భిణులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుంటే తప్పా దవాఖాన అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దవాఖానలో అవసరమయ్యే పరికరాలు సమకూర్చి అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో మందికి మేలు చేకూరనుంది. స్థానిక అధికారపార్టీ నాయకులు, జిల్లా వైద్యాధికారులు రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన దవాఖాన ఏడాది కాలంగా ఓపీ సేవలకే పరిమితమైంది. ఇప్పటికైనా మాతాశిశు దవాఖానను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.