హైదరాబాద్, జూన్ 10, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని మోయతుమ్మెద వాగులో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాగులో అక్రమంగా, వాణిజ్య ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతు, జర్నలిస్టు తిగుళ్ళ కృష్ణమూర్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో కోరిన ప్రధాన ఉపశమనానికి అనుగుణంగా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య అవసరాల కోసం వాగులోని ఇసుక తవ్వకాలు చేపట్టరాదని తేల్చి చెబుతూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతిరావు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించారు. పిటిషనర్ వాదనలు, రికార్డులను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి, ఈ మేరకు నిర్దిష్ట ఉత్తర్వులు జారీ చేశారు. మోయతుమ్మెద వాగులో ధూళిమిట్ట పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గనులు, రెవెన్యూ, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలన్నారు. ఈ కేసులో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, గనులుభూగర్భ శాఖ అధికారులు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ తదితరులు తమ వాదనలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయస్థానం ముందు న్యాయవాదులు పి.బాబురావు, కల్యాణి వాదించారు. మోయతుమ్మెద వాగు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన నీటి వనరుగా ఉందని, అక్రమ ఇసుక తవ్వకాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని చెప్పారు. ఒక్క ధూళిమిట్టలోనే 1,500 ఎకరాలకు పైగా భూమిని సాగు చేస్తున్న 300 మంది రైతులకు ఈ వాగు జీవనాధారమని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసమని, ఇతర అవసరాల కోసమని పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అక్రమంగా యంత్రాలతో ఇసుకను తీసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. దీనివల్ల వాగు సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు చెక్డ్యాంలలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని తెలిపారు. దాంతో చుట్టుపక్కల రైతులకు సాగునీటి కొరత ఏర్పడి పలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాండ్ మైనింగ్ మార్గదర్శకాల ప్రకారం తొలి శ్రేణి వాగు (ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్) పరిధిలోకి మోయతుమ్మెద వాగు వస్తుందని, ఇలాంటి వాగుల నుంచి స్థానిక అంటే వాగు ఒడ్డున ఉన్న గ్రామం అవసరాలకు మాత్రమే ఇసుక వినియోగానికి అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా విచక్షణారహితంగా ఇసుక తవ్వేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని వాదించారు. గ్రామ అవసరాలకే ఇసుకను పరిమితం చేయాలని ధూళిమిట్ట గ్రామ సభ తీర్మానం చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో తవ్వకాలు రాత్రింబవళ్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాండ్ మైనింగ్ మార్గదర్శకాల ప్రకారం తొలి శ్రేణి వాగు (ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్) పరిధిలోకి మోయతుమ్మెద వాగు వస్తుందని, ఆ నిబంధనకు లోబడి మాత్రమే తవ్వకాలు ఉండాలన్నారు. ఈ నిబంధన ప్రకారం సదరు వాగు నుంచి స్థానిక ధూళిమిట్ట గ్రామ అవసరాలకు మాత్రమే ఇసుక వినియోగానికి అనుమతి ఉంటుందని వివరించారు. ఇందులోనూ చట్టపరమైన నిబంధనలు, అనుమతులు, పర్యావరణ మార్గదర్శకాలకు లోబడి మాత్రమే తవ్వకాలు ఉండాలన్నారు. 2004 వాల్టా చట్టంలోని 23వ నిబంధన ప్రకారం ఏ ప్రాంతాల్లోనైతే శాండ్ మైనింగ్ కారణంగా భూగర్భ జలాలు క్షీణిస్తాయో ఆ ప్రాంతాలను నోటిఫై చేసి ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణాను నిషేధించాల్సి ఉందని, వాగును ఆనుకొని ఉన్న గ్రామ అవసరాలకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుందని వివరించారు.2016లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుస్థిర ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం పర్యావరణ అనుకూలమైన, నియంత్రిత పద్ధ్దతిలో మాత్రమే ఇసుక తవ్వకాలు ఉండాల్సి ఉందన్నారు. జల వనరుల పర్యావరణ వ్యవస్థలను, భూగర్భ జలాలను, ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మేలు చేకూరేలా ప్రకృతి వనరులను వినియోగించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వాదనల అనంతరం న్యాయమూర్తి, పిటిషనర్ కోరిన ఉపశమనాన్ని పరిగణనలోకి తీసుకుంటూ వాణిజ్య అవసరాల కోసం ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అది కూడా చట్ట నిబంధనలకు లోబడి అనుమతించే విషయాన్ని ప్రతివాదులు పరిశీలించవచ్చని తేల్చి చెబుతూ న్యాయమూర్తి జస్టిస్ చలపతిరావు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. అక్రమ, వాణిజ్య ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభు త్వం, గనులుభూగర్భ శాఖ అధికారులు, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఇతరులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2018లో విడుదల చేసిన శాండ్ మైనింగ్ ఫ్రేమ్ వర్క్.. ప్రకారం వాగులు, వంకలను వాటి ప్రవాహ పరిమాణాన్ని బట్టి వివిధ కేటగిరీలుగా వర్గీకరణ జరిగింది. ఒకటి, రెండు శ్రేణి వాగుల్లో ఇసుక తవ్వకాలు ప్రధానంగా స్థానిక గ్రామ అవసరాలకే పరిమితం కావాలి. వాణిజ్య అవసరాల కోసం భారీ స్థాయిలో ఇసుక తరలింపు చేయకూడదు.
తెలంగాణ స్టేట్ శాండ్ మైనింగ్ రూల్స్2015 (జీవో ఎంఎస్ నెం.3) ప్రకారం మొదటి, రెండో శ్రేణి వాగుల్లో స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే పరిమిత మోతాదులో ఇసుకను వినియోగించవచ్చు. వాణిజ్య రవాణ, నిల్వలు లేదా విక్రయాల అనుమతికి వీల్లేదు. ఇసుక రవాణా గ్రామ పరిధిలోనే ఎడ్ల బండ్లు లేదా ట్రాక్టర్ల ద్వారా మాత్రమే జరగాలి.
కేంద్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన సుస్థిర ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాలకు ముందు జిల్లా సర్వే నివేదిక (డీఎస్ఆర్), పర్యావరణ ప్రభావ అంచనాలు, ఇసుక పునరుత్పత్తి సామర్థ్యంపై అధ్యయనాలు నిర్వహించాలి. నదులు, వాగుల సహజ స్వరూపాన్ని దెబ్బతీయకుండా శాస్త్రీయ పద్ధతుల్లోనే తవ్వకాలు జరగాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ (వాల్టా)2002 నిబంధనల ప్రకారం భూగర్భ జలాలపై ప్రభావం చూపే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. భూగర్భ జలాలు క్షీణిస్తున్న ప్రాంతాలను నోటిఫై చేసి, అక్కడ ఇసుక రవాణా లేదా తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం చట్టం కల్పించింది.