చేగుంట, ఏప్రిల్16: రైతులకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసాను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు, రైతు భరోసా మొత్తాన్ని నిలిపివేయడం, పండించిన ధాన్యాని కొనుగోలు చేయక పోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పిటిషనర్ల భూములు సుమారు 8ఎకరాల 32 గుంటల ఉండగా, సివిల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఆధారంగా తీసుకుని అధికారులు రైతుబంధు, రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేశారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ కేవలం భూమిని విక్రయించకూడదు, లేదా బదిలీ చేయకూడదనే పరిమితి మాత్రమే విధించిందని, రైతు సంక్షేమ పథకాలను నిలిపివేయడానికి అది కారణం కాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్లను పంపింది.
పిటిషనర్లకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో పాటు పిటీషనర్ల భూమిలో పండించిన ధాన్యాన్ని ఇందిరా కిసాన్ పథకం కింద కొనుగోలు చేయడానికి అనుమతించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ఎల్.ప్రతీమ్రెడ్డి వాదనలు వినిపిస్తూ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఉన్నా రైతు బంధు, రైతు భరోసా నిలిపి వేయడం చట్టబద్దం కాదని, రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనాలను పరిగణంలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు జూన్ 16కు వాయిదా వేసింది.