 
                                                            నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 30 : మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసులు డీఆర్ఎఫ్ బృందాల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, మంచి నీటిని అందజేశారు. చేతికొచ్చే దశలో వరి, పత్తి పంటలు నీట మునగడం.. ధాన్యం, మక్కలు తడిసి మొలకెత్తడంతో రైతులను కోలుకోలేని నష్టం జరిగింది. రెక్కల కష్టం నీళ్లలో కొట్టుకుపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. వరదలో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా, జఫర్‌గఢ్ మండలంలో మత్తడిలో పడి యువతి గల్లంతైంది. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. వరద ధాటికి పశువులు, గొర్రెలు, కోళ్లు మృత్యువాత పడ్డాయి.

వరంగల్ నగరంలో వాన తగ్గినా వరద వదలలేదు. అనేక కాలనీలు రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గుతున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు మోకాళ్ల లోతులో ప్రవహిస్తున్నది. వరంగల్, హనుమకొండ నగరాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలోనే మగ్గారు. భవనాలపై ఉండి సహాయం కోసం ఎదురు చూశారు. వరద నీటిలో చిక్కుకున్న పలు కాలనీ ప్రజలకు అధికారులు డ్రోన్ ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వరంగల్ నగరంలోని సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషిమాతా నగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, నాగేంద్ర నగర్, సాకరాశికుంట, శివనగర్, మైసయ్యనగర్, రామన్నపేట, పోతన బైపాస్ రోడ్డు, రఘునాథ్కాలనీ, లేబర్‌కాలనీ 100 ఫీట్ల రోడ్డు, సుందరయ్యనగర్, మణికంఠ కాలనీ, సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, శాంతినగర్,
పద్మనగర్, మర్రి వెంకటయ్య కాలనీ, హనుమకొండలోని భద్రకాళీ రోడ్డు, కాపువాడ రోడ్డు, రామకృష్ణ కాలనీ, ఎస్బీఐ కాలనీ, దేవరాజ్కాలనీ, జవహర్ కాలనీ, భీమారం బ్యాంక్‌కాలనీ, సమ్మయ్య నగర్, అమరావతి నగర్, టీవీ టవర్, ఇందిరానగర్, కాకతీయ కాలనీలు ఇప్పటికీ వరద నీటిలోనే మగ్గుతున్నాయి. సీఎస్ఆర్ గార్డెన్ నుంచి మెడికవర్ ఆస్పత్రి వరకు పెద్ద ఎత్తున నీరు నిలవడంతో హంటర్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఉట్కూరి ప్రభాకర్‌కు చెందిన కోళ్ల ఫారంలోకి నీళ్లు చేరడంతో 7వేల కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. జీల్గులలో కస్తూరి తిరుపతికి చెందిన 5 ఆవులు, 3 గేదెలు, ఒక లేగదూడ వాగులో పడి కొట్టుకపోయాయి.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. జనగామలోని పలు ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో రోడ్లు తెగిపోయాయి. నర్మెట మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన పంతెంగి చంద్రమౌళి 110 గొర్రెలు, వడాల పెద్దపురానికి చెందిన 150 గొర్రెలను గంటెమ్మ చెరువు సమీపంలోకి వెళ్లగా మత్తడి ఉధృతమై సుమారు 110 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తాము జీవనాధారం కోల్పోయామని, సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
 
                            