సంగారెడ్డి,ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మీటర్ల వర్షం కురిసింది. నిజాంపేట మండలంలో 13.3 సెం.మీటర్లు, కల్హేర్‌లో 11.9, హత్నూరలో 10.1, సిర్గాపూర్‌లో 9.9, అదోల్లో 9.0, జిన్నారంలో 8.4, గుమ్మడిదలలో 7.2 , చౌటకూరులో 6.7 సెం.మీటర్ల వ ర్షం కురిసింది. మిగతా మండలాల్లో 2 నుంచి 5 సెం.మీట ర్ల లోపు వర్షపాతం నమోదైంది. వర్షాలకు సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు 43వేల క్యూసెక్కుల నీటిని ఐదు గేట్ల ద్వారా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.604 టీఎంసీల జలాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి వస్తున్న వరదతో మంజీరా నది కళకళలాడుతున్నది. నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో దిగవకు 5వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1769 చెరువులు ఉన్నాయి. ఇందులో 675 చెరువుల్లో 50 శాతం, 518 చెరువుల్లో 75 శాతం, 352 చెరువుల్లో వందశాతం నీళ్లు నిండాయి. 210 చెరువు లు అలు గు పారుతున్నాయి. సంగారెడ్డి డివిజన్లో 52, జహీరాబా ద్ డివిజన్లో 21, నారాయణఖేడ్ డివిజన్లో 34, దౌల్తాబాద్ డివిజన్లో 103 చెరువులు అలుగు పారుతున్నాయి.
భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జహీరాబాద్ బూచినెల్లి-ఘనపూర్ మధ్య వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఝరాసంగం మేదపల్లి-ప్యాలవరం-పొట్పల్లి గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సిర్గాపూర్ మండలంలోని పలు వాగులు పొంగిపొర్లుతుండడంతో కల్హేర్-పిట్లం, వాసర్-కంగ్టి, రాసోల్-కంగ్టి మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. సిర్గాపూర్ మండలం వాసర్ శివారులోని ఊరవాగు పొంగిపొర్లుతున్నది. ఆదివారం రాత్రి వాసర్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి గ్రామానికి వెళ్లేందుకు ఊరవాగు దాటే ప్రయత్నం చేయగా వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. పవన్ అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సోమవారం ఉదయం పోలీసుల సహాయంతో కారును వాగులో నుంచి బయటకు తీశారు.
వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో 600 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొత్తూరులోని నారింజ వాగు గేట్లు ఎత్తటంతో వరద పొలాలను ముంచెత్తింది. మీర్జాపూర్, ఖలీల్పూర్, బూచినెల్లి, బూర్థిపాడ్ తదితర గ్రామాల్లో 200 ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి. నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో మరో 400 ఎకరాల్లో పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగాయి.