సంగారెడ్డి, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధారణం కంటే 60 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆరు మండలాల్లో సాధారణ వర్ష్షపాతం నమోదైంది. కొండాపూర్ మండలంలో అత్యధికంగా 3.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా నిజాంపేట మండలంలో అత్యల్పంగా 4 మి.మీటర్ల వర్షం కురిసింది. న్యాల్కల్, పుల్కల్ మండలాల్లో 3.7 సెం.మీటర్లు, జహీరాబాద్లో 3.6, సదాశివపేటలో 3.4, కంది, కోహీర్ మండలాల్లో 2.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. మనూరు, మొగుడంపల్లి, మునిపల్లి, వట్పల్లి, సంగారెడ్డి మండలాల్లో 2.2 నుంచి 2.1 సెం.మీటర్ల వర్షం కురిసింది. అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతుంది. పలు గ్రామాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తుంది. బుధవారం సింగూ రు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 11877 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో సింగూ రు ప్రాజెక్టు నుంచి మధ్యా హ్నం 14వ నెంబర్ గేటు ఎత్తి 12082 క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. నీరు వదిలే సమయంలో నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తుగా మం జీరా నదిపరీవాహక ప్రజలు, మత్స్యకారులు, గొర్రెల కాపర్లను అప్రమత్తం చేశారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.64 టీఎంసీల జలాలు ఉన్నాయి.
జిల్లాలో పత్తి, కంది పంటలకు నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని రైతులు వానకాలంలో 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 50వేల ఎకరాలకుపైగా పత్తి పంటకు నష్టం జరిగినట్లు అంచనా. తాజాగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పత్తి పంట 10వేల ఎకరాలకుపైగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సుమారు వెయ్యి ఎకరాల్లో కంది పంట మునిగినట్లు తెలుస్తుంది.చాలా గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడవడంతో నష్టపోయారు. పంటనష్టం వివరాల సేకరణను వ్యవసాయశాఖ ఇంకా మొదలుపెట్టలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదని, ఉత్తర్వులు వచ్చిన తర్వాత పంటనష్టం వివరాలు సేకరిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.