మెదక్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రం చెరువును తలపించింది. ఆయా కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో వరద తీవ్రత అధికమైంది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది.
మెదక్‌లో 17.6 సెంటీమీటర్లు వర్షం కురిసినట్టు రికార్డు నమోదైంది. మెదక్ మండలం రాజ్‌పల్లిలో 9.5 సెంటీ మీటర్లు, పాతూర్‌లో 8 సెంటీమీటర్లు, హవేళీఘనపూర్ మండలం నాగాపూర్‌లో 6 సెంటీమీటర్లు, సర్ధనలో 3 సెంటీమీటర్లు, వాడిలో 3 సెంటీమీటర్లు, రామాయంపేటలో 3.88 సెం.మీ, రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో 3.63 సెం.మీ, నార్సింగి మండలంలో 2 సెం.మీ, కౌడిపల్లిలో 2 సెం.మీ, పాపన్నపేటలో 1 సెం.మీ, చిప్పల్‌తుర్తిలో 1 సెం.మీ, చిట్కుల్లో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
మెదక్‌లోని ప్రధాన రోడ్లు జలమయమయ్యా యి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకదాటిగా కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారి నదిని తలపించింది. రాందాస్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోనగర్‌లోని ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ద్విచక్ర వాహనాలు నీటిలో తేలాయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లో రోడ్లపై నీరు రావడంతో పాటు దుకాణాల్లోకి వరద చేరింది. ప్రధాన రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ప్రధాన రోడ్డుపై గల డివైడర్‌ను జేసీబీ సహాయంతో తొలిగించి వరదను తరలించారు.
పట్టణంలోని పలు లోతట్టు ప్రాం తాల్లోని కాలానీల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పోర్లాయి. మూడు గంటల్లోనే మెదక్ పట్టణాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. గాంధీనగర్ కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. సాయినగర్, వెంకట్రావ్‌నగర్ కాలనీల్లో వరద చేరి జలమయ్యమయ్యాయి. గంగినేని థియోటర్ వద్ద గల ఎమ్ఎన్ కెనాల్ పొంగిపొర్లడంతో ప్రధాన రోడ్డుపైకి నీరు చేరి ఇబ్బందులు ఎదురయ్యాయి. నర్స్‌ఖేడ్ వేళ్లే దారిలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలోకి వర్షం నీరు చేరడంతో బాలికలను ఇంటికి పంపించారు. కుండపోత వర్షానికి పట్టణవాసులు గజగజ వణికిపోయారు.