మెదక్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు మెతుకు సీమను ఆగమాగం చేశాయి. మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లె ప్రజలకు రాకపోకలు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రైతులు కూడా ఎటువెళ్లలేని పరిస్థితి దాపురించింది. ధ్వంసమైన రోడ్లు , కల్వర్టులు, బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయిన రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఆయా మండలాల్లో 1400 విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. సుమారు 60 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతినగా, హవేళిఘనపూర్ మండలం సర్ధనలో విద్యుత్ సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. హవేళిఘనపూర్ మండలంలోని వాడి, దూప్సింగ్తండా తదితర గ్రామాలకు ఇంకా విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. అంతేకాకుండా మెదక్ మండలంలోని రాయిన్పల్లిలో సింగిల్‌ఫేజ్ కరెంట్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. త్రీఫేజ్ కరెంటు లేక పంచాయతీ బోర్లు నడవక తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో రూ.10 కోట్ల మేర విద్యుత్ సంస్థకు నష్టం వాటిల్లిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా 16వేల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా మెదక్, హవేళిఘనపూర్, చిన్నశంకరంపేట, టేక్మాల్, రామాయంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఎన్ని ఎకరాల్లో పంటలు నీట మునిగాయన్న దానిపై స్పష్టత రాలేదని, క్షేత్ర స్థాయిలో ఏఈవోలు, ఏవోలు గ్రామాల్లో సర్వేలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. మొత్తంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు ఏ స్థాయిలో నష్టపరిహారం అందుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీశాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినగా కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 60 రోడ్లు దెబ్బతినగా, 30 చోట్ల కల్వర్టులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. అయితే వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3 కోట్ల 99 లక్షలు అవసరమని, శాశ్వత పనుల కోసం రూ.17 కోట్ల 11 లక్షలు అవసరమని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోడ్డుకు కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టలేదు.
మెదక్ మండలం తిమ్మానగర్ నుంచి రాయిన్‌పల్లి వెళ్లే మార్గంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తిమ్మానగర్, మక్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి గ్రామస్తులకు రాకపోకలు బంద్ అయ్యాయి. మెదక్ మండలం కొంటూరు చెరువు అలుగు పారడంతో దాని పరిధిలోని గ్రామాలైన తిమ్మానగర్, మక్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివ్వాయిపల్లి, మల్కాపూర్ తండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో 70 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 36 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం కాగా, 9 చోట్ల గండ్లు పడ్డాయి. 59 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీటన్నింటికీ తాత్కాలిక మరమ్మతులకు రూ.4 కోట్ల 29 లక్షలు అవసరమని, శాశ్వత పనులకు రూ.76కోట్ల 68 లక్షలతో ప్రతిపాదనలు పంపారు.