హుస్నాబాద్, జూన్ 2: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పలుచోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి వరకు కూడా కరెంటు రాలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతం వరద నీటితో చిన్నపాటి చెరువును తలపించింది. మెయిన్ రోడ్డులో హైవే పనులు కొనసాగుతున్నందున రోడ్డుపైకి వర్షపు నీరు పెద్ద మొత్తంలో చేరడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇండ్లలోకి వరద చేరిం ది. చాలారోజుల తర్వాత భారీ వర్షం పడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి ప్రతాపంతో భగభగ మండిన వాతావరణం ఒకసారిగా చల్లబడటంతో జనం ఉపశమనం పొందా రు. రాత్రి వరకు కూడా ఉరుములు మెరుపులు కొనసాగాయి. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతో రైతుల్లో నూతనోత్సాహం వచ్చినట్లు అయింది. రేపటి నుంచి ఆరుతడి పంటల సాగు కు సన్నద్ధం కానున్నారు.
కోహెడ, జూన్ 2: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆదివారం సాయంత్రం ఈ దురుగాలులతో వర్షం కురిసింది. సుమారు అరగంట సేపు కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి ఉక్కపోత, ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కురిసిన వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. పట్టణంలో కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో పిడుగుపడటంతో అదే ప్రాం తంలో ఉన్న పెంట్రోల్ పంప్లో సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. ఆదివారం సంతకు వచ్చిన వ్యాపారులు, ప్రజలకు ఇబ్బం ది కలిగింది.
సిద్దిపేట, జూన్ 2 : సిద్దిపేట పట్టణంతో పాటు ఆయా మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రోజంతా ఎండగా ఉండి సాయంత్రం వాన పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సిద్దిపేటలో కురిసిన వర్షానికి రోడ్లపై వర్షం నీళ్లు పారాయి.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 2 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో ఆదివారం పిడుగు పాటుతో పాడిగేదె మృతిచెందింది. వల్లపట్లకు చెందిన నారదాసు రవి రోజు మాదిరి గానే తన పాడిగేదెను వ్యవసాయబావి వద్ద కట్ట్టేశాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వ్యవసాయ బావి వద్ద కట్ట్టేసి ఉన్న పాడిగేదె పిడుగు పాటుకు గురై మృతి చెందింది. దీని విలువ రూ.90వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
గుమ్మడిదల, జూన్ 2 : నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలతో పాటు పలు గ్రామా ల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. రైతులు వానకాలం పంటలకు సిద్ధపడుతున్నారు. యాసంగి సీజన్లో పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.