పుల్కల్, సెప్టెంబర్ 1: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు పోటెత్తడంతో అప్రమత్తమైన ఇరిగేషన్‌శాఖ అధికారులు 5, 6, 8, 9, 10, 11, 15 మొత్తం ఏడు స్పిల్ వే గేట్లు పైకిఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 79814 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో నాలుగు గేట్లను రెండు మీటర్లు, మరో మూడు గేట్లు 2.50 మీటర్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు సోమవారం ప్రాజెక్టు ఏఈ స్టాలిన్ తెలిపారు.
వరద ప్రాజెక్టులోకి గంటగంటకూ పెరుగుతుండటంతో చేసేదేమీలేక వచ్చిన నీరు వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులోకి వరద తీవ్రత పెరుగుతున్న సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వద్ద ఉండి ఎప్పటికప్పుడు హెచ్చు తగ్గులను గమనిస్తూ నీటిని వదులుతున్నారు. ఏడు గేట్ల ద్వారా నీరు విడుదల చేయడంతో వందల ఎకరాలు నీట మునిగాయి.
స్పిల్ వే గేట్ల ద్వారా 74049 క్యూసెక్కులు, జలవిద్యుత్ కేంద్రం రెండు టర్బైన్ల ద్వారా 1499 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలకు ప్రస్తుతం ప్రాజెక్టులో 19.919 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు,గొర్లకాపరులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.