సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 21 : సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగేండ్ల నుంచి యాసంగి పంటకు రంగనాయకసాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని, ఈ సారి యాసంగి పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రైతుల పక్షాన లేఖ ద్వారా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. నాలుగు సంవత్సరాల నుంచి సాగు నీరు రైతులకు అందించడం వల్ల పంట రాబడి పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.
రంగనాయకసాగర్ కింద ప్రతి ఏటా గణనీయంగా పంటరాబడి పెరుగుతుందన్నారు. ఈ ఏటా 50 వేల ఎకరాల పంట సాగులో ఉందని లేఖలో తెలిపారు. రంగనాయకసాగర్‌లో ఇటీవల 2.4 టీఎంసీల నీళ్లు పంపింగ్ చేశారని, ప్రస్తుతం రంగనాయకసాగర్‌లో 1.85 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే ఇంకా 2.5 టీఎంసీల నీరు అవసరం ఉందని తెలిపారు. మిడ్ మానేర్ నుంచి రెండు విడతలుగా రంగనాయకసాగర్‌లోకి నీళ్లు పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని మంత్రికి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
రైతులు సాగు నీళ్లు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, నాలుగు సంవత్సరాల నుంచి యాసంగికి రైతులకు సాగు నీరు అందించినట్లుగా ఈ యాసంగి పంటకాలం పూర్తయ్యేవరకు రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించాలని సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన నీటి పారుదల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.