గజ్వేల్, జనవరి 26: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ దశాదిశను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, కేసీఆర్ అద్భుతమైన భవనాలు కట్టిస్తే నేడు వాటికి సున్నం వేసే దిక్కులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి విసుగు చెందిన ప్రజలు కేసీఆర్ కావాలని కోరుతున్నారని, తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ హయంలో ఐదేండ్ల పాటు గజ్వేల్ బల్దియా పాలకవర్గం అద్భుతంగా పనిచేసిందని, కేసీఆర్ ఆశీస్సులతో గజ్వేల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునే అశకాశం లభించిందన్నారు.
ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించామని గుర్తుచేశారు. కేసీఆర్ సహకారంతో గజ్వేల్ చుట్టూ రింగ్‌రోడ్డు వచ్చిందని, కొద్దిగా పెండింగ్‌లో ఉన్న రింగ్‌రోడ్డును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. గజ్వేల్ అంటే టూరిజం స్పాట్‌గా మారిందని, విద్య, వైద్యం, మార్కె ట్, రైలు వచ్చాయన్నారు. ప్రజలకు ఎంత చేసినా కొంతైనా మిగిలి ఉంటుందని, కేసీఆర్ హయాంలో ప్రతి నెలా పల్లె, పట్టణ ప్రగతిలో నిధులు వచ్చేవని, ఇప్పుడు అవన్నీ బంద్ అయినట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడం తప్పా ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు ఇచ్చింది లేదన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అద్భుతమైన దవాఖాన కట్టిస్తే దానికి తాళం వేశారన్నారు. కేసీఆర్ హయాంలో కట్టించిన భవనాలను అందుబాటులోకి తీసుకు రాలేకపోతునారని, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేలా అందరూ ఒత్తిడి తేవాలని కోరారు. కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, దళితబంధు, బీసీబంధ అన్నీ బంద్ అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించడం ఏమీ చేయడం లేదని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు బయపడేది లేదన్నారు. ఏడాది కాలంలో ఒక్క శిలాఫలకం వేసింది లేదన్నారు.
వందశాతం పంట రుణమాఫీ కాలేదని స్వయంగా మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారని, కానీ.. సీఎం మాత్రం అందరికీ అయ్యిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు విమర్శించారు. అనంతరం గజ్వేల్ మునిపాలిటీ పట్టణ ప్రగతిని హరీశ్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణాశర్మ, పన్యాల భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్ద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.