న్యూఢిల్లీ, మార్చి 14: ప్రస్తుతం ఎల్పీజీపై ఆందోళన నెలకొని ఉందని కేంద్రం శనివారం తెలిపింది. అయితే ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రం వద్ద నిల్వలు నిండుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం పెరుగుతున్న దృష్ట్యా భయంతో ఎల్పీజీ బుకింగ్‌లు వేగంగా పెరిగాయని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం ఇరాన్ జలసంధిని మూసివేయడంతో ఇంధన నౌకల రవాణా నిలిచిపోయింది. అయితే కేంద్రం మాత్రం ముడి చమురు సరఫరా సమృద్ధిగా ఉందని, డీజిల్, పెట్రోల్ నిల్వలకు కొరత లేదని స్పష్టం చేసింది. ఎల్పీజీ కోసం భయాందోళనతో ప్రజలు అధికంగా బుక్ చేసుకుంటున్నారని, అవసరమైనపుడే రీఫిల్ కోసం బుక్ చేసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రజలకు సూచించారు. ఇలా భయాందోళనతో దాదాపు 88 లక్షల మంది సిలిండర్ కోసం బుకింగ్ చేశారని చెప్పారు. వాణిజ్య సిలిండర్లను సరఫరా చేయడంపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వాణిజ్య సిలిండర్ల కోసం బుకింగ్‌లు ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రారంభమయ్యాయని ఆ అధికారి తెలిపారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ని అడ్డుకోవడానికి నిరంతరాయంగా దాడులు నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు.
హొర్ముజ్ దాటిన 2 నౌకలు
గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీతో రవాణా అవుతున్న రెండు భారతీయ నౌకలు శనివారం ఉదయం సురక్షితంగా హొర్ముజ్ జలసంధిని దాటాయని షిప్పింగ్ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. శివాలిక్, నందా దేవి అనే రెండు ఎల్పీజీ నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కండ్లా రేవులకు పయనిస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా చెప్పారు. 92,700 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్న ఈ రెండు నౌకలు ఈ నెల 19/17 తేదీల్లో భారతీయ రేవులను చేరుకోవచ్చని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హొర్ముజ్ జలసంధికి పశ్చిమ వైపున నిలిచిపోయిన 24 నౌకల్లో ఈ రెండు నౌకలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు.