సిద్దిపేట, ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం సగమంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేసిందని ప్రచారం చేసుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 2023 నాటిటి 2,09,093 క్రాప్ లోన్ అకౌంట్లు ఉన్నాయని, వీరికి రూ. 2026 కోట్ల పంట రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు.
ఇంకా రూ.1000 కోట్ల పంట రుణమాఫీ జిల్లాలో చేయాల్సి ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 40 వేల మంది రైతులకు 20 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. వ్యాపారం లేక సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలు తగ్గినట్లు హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేటలో మూడు రీజినల్ బ్యాంకు శాఖలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎస్బీఐ,యూనియన్ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంకు రీజినల్ కార్యాలయాలు ఇకడే ఏర్పాటు చేసుకున్నామని, దీంతో నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే అవసరం తప్పిందన్నారు. దీంతో రైతులు, వ్యాపారులకు మేలు జరుగుతున్నట్లు తెలిపారు.