సంగారెడ్డి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఫలితాల్లో హరీశ్‌రావు మార్కు విజయం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో హరీశ్‌రావు అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయతీరాలకు చేర్చారు. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 11 మున్సిపాలిటీలకు ఆరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో చైర్మన్ పీఠాలను దక్కించుకోనుంది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు ఐదింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కొద్దిదూరంలో ఉన్న మరోమూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపునకు హరీశ్‌రావు పావులు కదుపుతున్నారు. హరీశ్‌రావు వ్యూహరచన, ప్రచార సభలు బీఆర్ఎస్కు కలిసి వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే హరీశ్‌రావు అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ నాయకత్వం, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. ఎన్నికల్లో సమన్వయం కోసం సమన్వయకర్తలను నియమించారు.
ఆతర్వాత బలమైన అభ్యర్థులను బరిలో దింపడంతో పాటు బీఆర్ఎస్ గెలుపు కోసం అవసరమైన వ్యూహాలు అమలు చేశారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, గడ్డపోతారం, కోహీర్ మున్సిపాలిటీల్లో హరీశ్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒకేరోజు ఆరు మున్సిపాలిటీల్లో 15 సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. చెట్టుకింద రచ్చబండ చర్చా వేదికలతో మహిళా ఓటర్లను బీఆర్ఎస్కు చేరువ చేశారు. హరీశ్‌రావు ఎన్నికల వ్యూహం, ప్రచారంతో సంగారెడ్డి జిల్లాలో ఆరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పటాన్‌చెరులోని ఐదు మున్సిపాలిటీ చైర్మన్ పదవులు బీఆర్ఎస్ ఖాతాలోకి చేరడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. నాడు అసెంబ్లీ నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హరీశ్‌రావు తనదైన ముద్ర వేశారు.